సాహిత్యలోకం కవితల పోటీ – June 2019

మే ౨౦౧౯ [May 2019] – జూన్ ౨౦౧౯ [June 2019] వ్యవధిలో సాహిత్యలోకం ప్రకటించిన కవితల పోటీ లో పాల్గొన్న వారిలో మా ద్వారా ఎంపికైన విజేతలకు మా శుభాకాంక్షలు.

సాహిత్యం మనిషికి ఊపిరి కావాలని, సాహిత్యమే మనిషిని ఉన్నతుడ్ని చేయగలదని నమ్ముతూ, మన తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం, వాణిజ్య పోకడలను అద్దుకుంటున్న మన తెలుగుకి పునర్వైభవం తీసుకురావడం కోసమే మా ఈ ప్రయత్నం. 

______________________________________________________________________________

కవితల పోటీ లో మొదటి స్థానం పొందిన వారు : శ్రీ కొండుభొట్ల చంద్రశేఖర్, పూణె

కవితల పోటీ

కవిత : నా పెంటి

చెనిగ మళ్ళల కెల్లి

నీల్లు నే పెడుతాంటే

ఎనికమాలే వొచ్చి నన్ను పడతోస్తాది

కాలుజారి నేను కాలవల పడితేను

పకపకా నగుతాది నా పెంటి

సెయ్యి ఊతాము పడతాది నా పెంటి

***

నూతిగట్టు కాడ తానమాడతవుంటె

తుండుగుడ్డా దాసి తానూ దాంకుంటాది

అమ్మల్లె వొచ్చి నా తలదుడవబోతాది

తల్లోన పేనంటు మొట్టి పరిగెడతాది

అల్లర్ల పొట్టి అది నా పెంటి

కొంటెకోనంగి యాసాల నా పెంటి

***

యేడేడిగా నీకు వొండాను చూడంటు

ఈపునొక్కటి చరిసి పారెల్లిపోతాది

ఇది ఏమి వొడ్డనని బిత్తరగ నేజూస్తే

యేడిబువ్వ ముద్ద ముద్దుగా పెడతాది

ఆటల సివంగిరా నాపెంటి

నాతో సయ్యాటలాడతది నా పెంటి

***

నాతోని తానుంటే దినామొక్క చనములే

నాముందు నిలుసుంటే నాకండ్ల పండగే

సీకటింటను గూడ కోటి దీపాలు నాపెంటి

సూరీడిముంగిట్ల ఎలుగుకే మెరుగైంది నాపెంటి

***

ఆయమ్మి గుండెలకు తలయెట్టి పండింటే

మవునంగ ఏయేటో సుద్దులే సెపుతాది

ఇశదంగ ఇవరించు నాకెరిక గాలేదంటే

గుండె ఊసులకేది బాస పొమ్మంటాది

ఏవో బాస్యాలు సదువుతది నాపెంటి

వింత బావనలు రేపుతది నా పెంటి

***

ఒక్కరేత్తిరి యేల ఏ పాడు కలో ఏమో

వొనికితా ననుజేరి కంటతడి పెడతాది

నీతాన నేనుంటే నీకేల బయమంటే

నేలేని చనమైన నీవుండుడెట్లాగంటు

కిందుమీదులైతాది నా పెంటి

నా కండ్ల యేరైతాది నా పెంటి

***

ఎదను కోసే ఎతలు బయలెల్లనీమంటే

మనసు సప్పుడు దాటి ముచ్చట్లు లేవంటాది

అన్ని పలుకులకెల్లి పాటమొకటేనంటు

గుండెనుండా మనిసి మాటలే సదువంటు

సదివినోల్లకు మించి ఏదాంతి నా పెంటి

సదువు సన్నమెగాని సకలమెరిగింది నా పెంటి

***

ప్రెతి మాట ప్రెతి ఆట అర్దమే తానుగా

బతుకు అర్దము జెప్పి నాబతుకు పండిస్తాది

అద్దమోలే నన్ను నాకు జూపిస్తాది నా పెంటి

నా ఉనికంత తను నిండి నన్ను నడిపిస్తాది నా పెంటి

_____________________________________________________________________________

కవితల పోటీ లో రెండవ స్థానం పొందిన వారు : శ్రీ పంతాడి లోకరాజు

కవిత : ఆడబొమ్మ

ఇదిగో ఇటు చూడరా…!!!
అక్కడ కనిపిస్తుందే, ఆమె ఒక సాధారణ స్త్రీ.
అందరూ అంటారు నువ్వు కేవలం ఒక ఆడదానివే అని.
ఆడది ఎప్పటికీ ఆడబొమ్మనేనా?
కాదురా…

***

ఆడదానిలో చూడకు ఆటబొమ్మ, 
ప్రతీ పుట్టుకా తొలి పలుకు గొప్ప పదం అమ్మ.
నీ జననానికి నాంది పలికి తన జీవితాన్ని పనంగా పెట్టే మాతృ మూర్తియే ఈ ఆడబొమ్మ.
నీవు ఆకలి అంటే తన కడుపు పస్థులుంచి, నీకు గిరిగోరుముద్దలు పెట్టే సోదరియే ఈ ఆడబొమ్మ.
అర్థం కాని నీ జీవితానికి ప్రతి పద అర్థం వివరించే గురువుయే ఈ ఆడబొమ్మ.
అలసిన నీ దేహానికి శారీరక సంతోషంని ఇచ్చే భార్యయే ఈ ఆడబొమ్మ.
నీ మానసిక సంతృప్తి కోసం నమ్మకంతో నీతో నడిచే మంచి స్నేహితురాలే ఈ ఆడబొమ్మ.
తెలుసుకో, తెలుసుకో, తెలుసుకో…

***

ఆడదంటేనే అందం, ఆడదంటేనే నమ్మకం.

ఆడదంటేనే ఓర్పు, ఆడదంటేనే సహనం.

ఆడదానిలోనే ఉంది భూలోకం,

దేవుడు సైతం పూజించే మరో లోకం..


ఆడదంటే కాదురా ఆట బొమ్మ,
తను తలచుకుంటేనే ఏ జీవికైన మరో జన్మ.

_____________________________________________________________________________

[గమనిక: మూడవ స్థానానికి ఇద్దరు ఎంపిక అయ్యారు]

కవితల పోటీ లో మూడవ స్థానం పొందిన వారు : శ్రీ టంకాల వినీత్. పాతపట్నం, శ్రీకాకుళం.

కవితల పోటీ June 2019

కవిత : మగువ

విశ్వం అంత విఖ్యాత…

స్వర్గం అంత సౌఖ్యాత…

సొంతమైన మనస్సు ఇలా…

కోరుకుంది నీ జత….

***

సర్వం అయ్యాక నీ యద…

నాకు జగమే శూన్యం  కదా…

నీ మౌనమే మాటైతే….

సంకెళ్ళు తీసేయదా నీ యద…

***

ఓ మగువ…

అందమంతా ఆరబోసి…

అందనంత ఎత్తులో…

జాబిల్లి లాగ మురిపిస్తే ఏం లాభం…

కాసేపు పరిమళించి… పూట లోనే వాడిపోయే

పువ్వు లాంటిదే ఈ అందం…

_____________________________________________________________________________

కవితల పోటీ లో మూడవ స్థానం పొందిన వారు : శ్రీ మోరెడ్డి అన్వేష్ రెడ్డి, బుక్కపురం, గద్వాల్

కవితల పోటీ  June 2019

కవిత : ఆలోచన

నేనంటే నా దేహం కాదు, నేనంటే నా ఆలోచన –

ఆలోచించాలి అనే ఆలోచన పుట్టిన క్షణాన నా పుట్టుక!

నమ్మకంతో నిండిన ఈ లోకాన నా ఆలోచనలకి తావు ఎక్కడో అని పరితపిస్తున్నా,

ఏ మూలన నా తావు దాగి ఉందో అని అలుపెరుగక పరిగెడుతున్నా!

***

ఆలోచనలతో నా మెదడు ఆర్తనాదాలు పెడుతుంది,

నా తల బద్దలు గొట్టుకుని మాటల రూపంలోకి రావాలని!

ఆలోచనల పుట్టగా నా మెదడు నిండిపోతుంది,

బద్దలైపోతుందేమో అని బయమేసేంతలా!

***

కనుచూపు మేరలో ఎదురుచూస్తున్నా కలలా నిలుచున్నావు,

కనులు మూసే లోపు ఆ కలను నిజం చేసుకోవాలనుంది!

జ్ఞాన సంపాదనలో అంతిమ లక్ష్యం అంటూ ఏదీ లేదు,

కానీ అంతిమంగా జ్ఞాన సంపాదనే లక్ష్యం!

నిన్ను తప్ప నేను ఈ లోకంలో కోరుకునేది ఏమున్నాది,

నువ్వు తప్ప నాకు ఈ లోకంతో పని ఏమున్నాది!

***

నా వెంట నువ్వు ఉండగా నాకు జన్మ ఒకటి చాలునా,
నూరు జన్మలు ఇమ్మని అడగనా ఆ దేవుని!
నూరు జన్మలైనా చాలవేమో నాతో నీ బంధం తీరడానికి,
చావులేని వరం ఇమ్మని అడగనా ఆ దేవుని!

***

ఎన్ని జన్మలు ఎత్తినా నా తోడు నువ్వే,
పుట్టుకలో… బ్రతుకులో… చావులో!

_____________________________________________________________________________

కవితల పోటీ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. పోటీ కావున కొందరు గెలవటం, కొందరు ఓడటం సహజం. గెలిచిన వారు తమ కవిత్వాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తారు అని, గెలవని వారు తమ సాహిత్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఎట్టి పరిస్థితిలో ప్రయత్నించడం ఆపడకూడదు అని కోరుకుంటున్నాము.

భవిష్యత్తులో సాహిత్యలోకం ద్వారా మరిన్ని పోటీలు ఏర్పాటు చేస్తాము, అందులో కూడా పాల్గొనమని మా మనవి.

Comments

comments