ఒంటేనుగు | Camel & Elephant

అనగనగా ఒక అరణ్యంలో, ఏనుగుల గుంపు నుండి ఒక ఏనుగు విడిపోతుంది. దారి తెలియక చాలా సేపు తిరిగి, తప్పిపోయి ఆ అరణ్య సమీపాన ఉన్న ఎడారికి చేరుతుంది. ఎడారి అంటే సరిగ్గా తెలియని ఆ ఏనుగు, ముందుకు వెళ్తే నీరు దొరుకుతుందేమో అనే ఆశతో ఎడారిలోకి వెళ్తుంది. పాపం, ఆ ఏనుగు ఎంత తిరిగినా ఒక్క నీటి చుక్క కూడా కనిపించదు. ఇంతలో ఆ ఏనుగుకి దూరంలో ఒంటె కనిపిస్తుంది. సాటి జంతువు కనిపించిందని సంతోషంతో త్వరత్వరగా ఆ ఒంటె దగ్గరకి వెళ్లి, తనకి దాహంగా ఉంది నీళ్లుంటే ఇవ్వమని అడుగుతుంది.

ఒంటేనుగు - camel and elephant

ఏనుగు దాహాన్ని అర్ధం చేసుకున్న ఆ ఒంటె – “అయ్యో మిత్రమా, నా దగ్గర నీరు లేదు. నేను ఒంటెని, నీరు తాగకుండా చాలా రోజులు ఉండగలను.” ఆ మాటతో నీరసించిన ఏనుగు చేసేదేమి లేక, పోనీ నీరు ఎక్కడ దొరుకుతుందో చెప్పమని అడుగుతుంది. “నేను వెళ్లే చోట నీరు తప్పకుండా దొరుకుతుంది, నువ్వు కూడా నాతో రా” అని చెప్పి ఏనుగుని వెంట తీసుకెళ్తుంది. చాలా దూరం ప్రయాణం చేశాక, ఒంటె అలసిపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తుంది, అది గమనించిన ఏనుగు ఒంటెను తనపై ఎక్కమని చెప్తుంది.

“మిత్రమా, నువ్వే బాగా దాహంతో ఉన్నావు, నన్ను ఎలా మోస్తావు?” అని ఒంటె అడుగుతుంది. “దాహం వేస్తున్నా, నేను ఏనుగుని, నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు సహాయం చేయదలిచిన నిన్ను మోస్తాను” అని నమ్మకం కలిగించేలా చెప్తుంది ఏనుగు. నెమ్మదిగా ఏనుగు మీదకి ఎక్కుతుంది ఒంటె, పడిపోకుండా పట్టుకోగానే, ఏనుగు ప్రయాణం మొదలుపెడుతుంది. గమ్యానికి కొద్దీ దూరంలోనే ఉన్నాము అని ఒంటె చెప్పగా, ఏనుగు ఆనందిస్తూ ఓపిక నశించినదై కింద పడిపోతుంది. స్పృహ కోల్పోయిన ఏనుగుని ఎలాగైనా నీటి దగ్గరకి చేర్చాలని, ఒంటె శక్తినంతా కూడబెట్టుకుని ఏనుగుని కొద్ది-కొద్దిగా ముందుకు నెట్టుకుంటూ గమ్యానికి చేర్చుతుంది.

పరుగున వెళ్లి నీరు తీసుకొచ్చి ఏనుగుని నీటితో తడిపేస్తుంది ఒంటె. నీరు తగలగానే స్పృహలోకి వచ్చిన ఏనుగు, తన చుట్టూ కేరింతలు కొడుతున్న ఒంటెను చూసి ఆనందంతో హత్తుకుంటుంది. ఏనుగు సరిపడా నీరు తాగాక, ఒంటె ఆ ప్రదేశం తన యజమానిదే అని చెప్తుంది. వారు మాటల్లో ఉండగా, యజమాని వచ్చి తన ఇంటి దగ్గర ఏనుగుని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఒంటె జరిగింది అంతా చెప్తుంది.

ఏనుగు నిద్రపోయిన తర్వాత యజమాని, ఏనుగు ఎడారిలోకి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించగా, ఒంటె “అడవిలో ఉన్న తన గుంపులో అందరూ ఈ ఏనుగుని చాలా చిన్నగా ఉందని, ఏమి చేయడం రాదని ఏడిపించేవారట, ఆ బాధతో వారి నుండి విడిపోయి, తప్పిపోయి, ఎడారిలోకి వచ్చింది” అని వివరిస్తుంది.

ఒంటేనుగు | Camel and Elephant

జరిగిన విషయం తెలుసుకుని, యజమాని తన పరివారాన్ని వెంట తీసుకుని అడవికి బయలుదేరుతాడు. అక్కడికి చేరుకొని, ఆ అడవిలో ఉన్న ఏనుగులని బంధించి, ఎడారి అంతా నడిపించి, తన ఇంటి వద్దకు తీసుకువస్తాడు. దాహంతో అల్లాడి, నీరసించిపోయిన తన వాళ్ళని చూసి ఏనుగు ఎంతో బాధపడుతుంది. ఈలోపు, పరివారం లో ఒకరు ఖడ్గం తీసుకువచ్చి యజమాని చేతిలో పెడతాడు. యజమాని ఏనుగుని పిలిచి, వీటిలో నిన్ను అధికంగా బాధ పెట్టిందో ఎవరో చెప్పు, ముందు దాని తలా నరుకుతాను అని గంభీరమైన కంఠంతో, కోపంతో రగిలిపోయే మొహంతో అడుగుతాడు.

ఏనుగు తన వాళ్ళని చంపడం ఏంటా అని ఆశ్చర్యపోతూ ఆ యజమాని ముందు నిలుచుని ఇలా అంటుంది – “అయ్యా మీరు నాకు ఎంతో చేశారు, ఒంటె రూపంలో నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు, నా మనసులో సంతోషం తప్ప కోపం లేదు. వారు నా వాళ్ళు, నేను వాళ్లకి నచ్చకపోయినా, వాళ్లంటే నాకు ప్రేమ ఉంది; దయచేసి వాళ్ళని వదిలేయండి.”

ఏనుగుకి అంత ప్రేమ ఉంది అని అర్ధం చేసుకున్న మిగతా ఏనుగులు తప్పు తెలుసుకుని కన్నీటి పర్యంతమవుతాయి. అది చూసి యజమాని పక్కున నవ్వి – “మిత్రమా, నీ మంచితనం తెలియాలనే ఉద్దేశంతోనే వీటిని ఇక్కడికి తీసుకువచ్చాను. నీకు ఇక్కడ మేమున్నా, మీకు మేము ఎప్పటికీ కుటుంబం కాలేము, ఇకపై నీ వారితో అరణ్యంలో సంతోషంగా జీవించు” అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఏనుగులు ఘీంకరించగా, ఏనుగు మాత్రం ఒంటె దగ్గరకు వెళ్లి ఘాడంగా హత్తుకుంటుంది. ఒంటె, ఏనుగుకి జాగ్రత్తలు చెప్పి, కన్నీరు తుడుచుకుంటూ, ఏనుగుని తన గుంపు వద్దకు తీసుకువెళ్తుంది.

నీతి: మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది.

Comments

comments