సమాధి, మూడు పక్షులు, అండము

ప్రవాహం లాంటి జీవితాన్ని వదిలి అతను సమాధి లో పడుకున్నాడు. ఎంత కాలం గడిచినా అరిషడ్వర్గాలు వీడక అతడి ఆత్మ అతడితో పాటే సమాధిలో గడుపుతుంది. స్వభావం చచ్చిపోలేదు, శరీరం కుళ్లిపోలేదు, ప్రాణం విడిచిపోలేదు. అంధకారంలో గడిపినవి క్షణాలో, యుగాలో తెలియని అతను భరించలేక తనకి తోడు ఉన్న వాటిని అన్నిటిని తనలో కలిపేసుకుని భూమిని నెమ్మదిగా తొలుచుకుంటూ బయటకి వచ్చాడు. నయానందకరమైన ఎన్నో దృశ్యాలను ఆశించిన అతడికి చుట్టూ ఎడారి కనిపించింది. నాగరికత, మనిషి జాడ లేని అంతులేని సూన్యమంత ఎడారి. నడక అలవాటు పోయి మొదట పాకడం మొదలుపెట్టాడు, కాసేపటికి జీవం సత్తువ తెచ్చుకోవటంతో నడక ప్రారంభించాడు. గమ్యంలేని తోకచుక్క వలే ఇసుక రేణువులు కాలి కింద తొక్కుతూ ముందుకు వెళ్ళాడు అతను.


తనను వృద్ధి చేసిన సమాధి కనుచూపుకి దూరమయ్యింది, కనుచూపు మేర లక్ష్యం గోచరించక తిన్నగా గీత గీసినట్టు నడుస్తున్నాడు. ఆ నడకలో జీవం లేదు, చావు లేదు, నిరర్థకమైన నడక. మదిని, మనుసుని తన లక్ష్యం ఏమిటో ప్రశ్నించుకుంటూ వెళ్తున్న అతనికి పక్షుల అరుపులు వినిపించాయి, తల తిప్పి చూడగా ఎండిపోడానికి సిద్ధంగా ఉన్న పచ్చ గడ్డి. ఆ పచ్చ గడ్డి ఆకలి తీరుస్తుందని పీకబోయాడు అతను, అందులో నుండి మూడు పక్షులు బయటకి ఎగిరాయి.


మొదటి పక్షి శ్వేత వర్ణంలో కాంతులు వెదజల్లుతూ ఉంది, రెండవ పక్షి ఎర్రగా రక్తపు వర్ణంలో ఉంది, మూడవది మసిని మించిన నలుపు వర్ణంతో ఉంది.


ఆ మూడు పక్షులు కనపడగానే వాటిని పట్టుకోవడానికి చూసాడు అతను, అవి చేతిలోనుంచి దూరిపోయేవి. ఆ పక్షులు తన భ్రాంతి అనుకుని, గడ్డి తినుటకు నిశ్చయించుకుంటాడు, అక్కడ గడ్డి ఎండిపోయి నారలా మారిపోయింది. చేసేది ఏమి లేక ముందుకి సాగాడు – ఆ పక్షులు మాత్రం అతనిని వదలక వెంట వస్తున్నాయి. కొద్ది రోజుల నిరాశాజనకమైన నడకతో అలసిపోయిన అతను తన ముందు నీటి కొలను ఉంటె బాగున్ను అని ఆలోచించాడు. వెంటనే, నీటి కొలను ప్రత్యక్షమయ్యింది – సంతోషంతో దాహం తీర్చుకుని, ఈత కొట్టి, కొలను దగ్గరే నిద్రపోయాడు. తెల్లవారే సరికి నీటి కొలను అదృశ్యం – యధార్థమో ఎండమావో తెలుసుకునే ఆసక్తి లేక అతడు ముందుకి సాగాడు. కొలను మహిమో ఏమో తెలియదు కానీ ఆ పక్షులు పిచుక పరిమాణం నుండి గోరింక అంత పరిమాణంలోకి వచ్చాయి.


శ్వేత వర్ణపు పక్షి ఎల్ల వేళలా అతని తల చుట్టూ ఎగురుతుంది, ఎరుపు వర్ణపు పక్షి నిరంతరం అతని చెవి దగ్గర అరుస్తూ ఉంది, నలుపు వర్ణపు పక్షి అతని బుజాల మీద నిద్రపోయేది [అతను నిద్రపోయేటప్పుడు మాత్రం అది ఎగురుతూ ఉండేది]. వాటి ఉనికి తట్టుకోలేకపోయేవాడు అతను. వాటిని తరమలేక, పట్టుకోలేక సతమతం అయ్యేవాడు. ఆ పక్షులతో ప్రయాణం చాలా కాలం సాగించగా అతనికి ఆ ఎడారిలో ఒక నాడు, ఒక వృక్షం కనిపించింది.

సమాధి


అమితమైన ఆనందంతో ఆ వృక్షం నీడలో సేదతీరి నిద్రపోయాడు అతను.
నిద్రలో ఎన్నో కలలు, కొలనులో జలకాలు, పూర్వ జన్మ జ్ఞాపకాలు, సమాధిలో మీమాంసలు అతనికి గుర్తు వచ్చాయి. నిద్రలో నుండి మేలుకోగానే, ప్రాపంచిక అగాధంలో నుండి తేరుకున్న వాడిలా ప్రసన్న వదనంతో ఉన్నాడు అతను.


దట్టమైన గెడ్డం పెరిగిపోయింది, అందులోకి ప్రవేశింపఁజూసింది నలుపు పక్షి, దానికి సాధ్యపడలేదు.
చెట్టు వేర్లు అతనిలో భాగమైనట్టు చుట్టుకుపోయాయి, వాటిని పొడిచి తీయడానికి ప్రయత్నించింది ఎరుపు పక్షి, దానికి సాధ్యపడలేదు.
తన గొంతుతో విశ్వం ఎంతో అందమైనది పాడి తెలిపింది శ్వేత వర్ణపు పక్షి, అతను చలించలేదు.


అతను వృక్షం వైపు చూసాడు, అది తనలోని ఎండు కొమ్మలను చితిలా పేర్చింది. ఆకాశం వైపు చూసాడు, పిడుగు పది చితి అంటుకుంది. పక్షుల వైపు చూసాడు, ఆ మూడు పక్షులు ఒక్కొక్కట్టిగా చితిలో దూకాయి. ఆ చితిలో వాటి మరణంతో, తనలోని జ్వాలను ఆత్మైకం చేసాడు. ప్రసన్న వదనంతో కనులు మూసి బయట ప్రపంచాన్ని అంధకారంలోకి పంపివేసి, తనలోని విశ్వాన్ని చూడటం ప్రారంభించాడు. తన చుట్టూ ఉన్న ఎడారి, సమాధి లోకి వెళ్ళిపోయింది.


సూర్యోదయ సమయానికి అతను కూర్చున్న ప్రదేశంలో ఒక అండము ఉంది.

అతనికే తెలియాలి, ఆ అండము నుండి దేవుడు పుడుతాడో లేదో?

పాఠకుడికి: ఆ మూడు పక్షుల పేర్లు ఏమిటో మీకు తెలుసా?

Comments

comments