నీతి కథ: నక్క – మేక

మనుషులు వదిలేసి, అరణ్యంగా మారిన ఒక విశాలమైన తోటలో, సంవత్సరాల క్రితం తవ్విన బావి ఉంది. పక్షులకి, జలచరాలకి తప్ప అందులో నీరు జంతువులకి అందేది కాదు. ప్రాణ భయం కలిగిన జంతువులు బావిలో నీటి కోసం ఆశ పడకుండా ఇతర ప్రదేశాలకు వెళ్లి దాహం తీర్చుకునేవి.

ఆ అరణ్య సమీపంలో నివసించే ఒక నక్క – “ప్రతి రోజూ తిండి కోసం వెతకాలి, నీటి కోసం కూడా వెతకాలా?” అని ఆలోచిస్తూ, ఆ బావి దగ్గరకి వచ్చి కూర్చుంది. అందులో నీరు చూడగానే నక్కకు దాహం తీర్చుకోవాలని ఆశ కలిగింది. ఆతృతను ఆపుకోలేక బావికి ఏర్పర్చిన రాళ్లను అదునుగా చేసుకుని బావిలోకి దిగడం మొదలు పెట్టింది. పురాతనమైన రాళ్లు కనుక, నక్క అడుగులకి ఒక రాయి విరిగి నక్క నీటిలో పడిపోయింది. నీరు ఎక్కువ లోతు లేకపోవడంతో ప్రాణాలతో బ్రతికి, బయటకి వెళ్లే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది ఆ నక్క.

నీతి కథ: నక్క - మేక

ఇంతలో ఒక మేక అటు వైపుగా వెలుతూ బావిలో కదులుతున్న నక్కను చూస్తుంది. మేక యొక్క రాకను గమనించిన నక్క, తన విచారాన్ని దాచుకుని నీటిలో స్నానమాడుతున్నట్లు కేరింతలు కొడుతుంది. ఆ నీరు ఎంత బాగున్నాయో అని పైకి అరుస్తూ ఆడుతుంది. అది చూసిన మేక నక్కని నీటి గురించి అడుగుతుంది. నక్క – “ఇంత శుద్ధంగా, రుచిగా ఉండే నీరు నేను జీవితంలో తాగలేదు” అని చెప్తుంది. ఆ మాట వినగానే మేక బావిలోకి దిగిపోతుంది.

నీరు నిజంగానే బాగుండడంతో మేక తృప్తిగా తాగి పైకి వెళ్దాం అనుకుంటుంది. అయితే పైకి వెళ్లడం కష్టంగా ఉండడంతో నక్కని ఉపాయం చెప్పమని అడుగుతుంది. అందుకు నక్క – “పైకి వెళ్లడం చాల సులభం మిత్రమా, కానీ మనం ఇద్దరం కలిసి పని చేస్తేనే సాధ్యం అవుతుంది.  ఆ విరిగిపోయిన మెట్టు కనిపిస్తుంది చూసావా? దాని ముందు మెట్టు వరకు వెళ్లి, ఆ మెట్టు పై మెట్టు నువ్వు అందుకో, నేను నీ మీద నుంచి ఎక్కి, ఆ మెట్టు ఎక్కేస్తాను. నేను ఎక్కినా తర్వాత నీ కొమ్ములు పట్టుకుని జాగ్రత్తగా నిన్ను కూడా పైకి లాగుతాను, ఇద్దరం బయట పడొచ్చు.”

నీతి కథ: నక్క - మేక

మేక, నక్కని పూర్తిగా నమ్మడంతో దానికి సహాయం చేస్తుంది. పై మెట్టుకి చేరుకోగానే, నక్క మేకను పట్టించుకోకుండా బావి బయటకి ఎక్కేస్తుంది. మోసపోయిన ఆ జంతువు, నక్క చేసిన పనికి కోప పడుతూ, తిడుతూ ఉండగా నక్క ఇలా అంటుంది –

“నీకు జుట్టు ఉన్నంత బుర్ర ఉండివుంటే ఒక నక్కని నమ్ముకుని బావిలోకి దిగకూడదు అనే విషయం నీకు తెలిసుండేది. పైగా కిందకి దిగేటప్పుడే పైకి ఎలా రావాలా అనే ఆలోచన లేని నీకు ఈ బావే సరైన చోటు.”

ఆ మాటలు చెప్పి నక్క వెళ్ళిపోతుంది, మేక తన దుస్థితికి బాధపడుతూ తిరిగి నీటి దగ్గరకు వెళ్ళిపోతుంది.

నీతి: సాధ్య-అసాధ్యాలు గురించి ఆలోచించకుండా ఎటువంటి కార్యాన్ని అయినా చేపట్టరాదు.

Source: The Fox and the Billy-Goat by Aesop

Comments

comments