జైలు గోడలు – కథా రచన పోటీ [2019] ప్రథమ స్థాన గ్రహీత

జైలు గోడలు – సమాజంలో, మనసులో ఏర్పరుచుకున్న కానరాని ఇనుప గోడలకు నిలువుటద్దం…

శుక్రవారం, జూన్ 1, 07 : 20 నిమిషములు

“ఫస్ట్ నేను వెళ్తాను రవి…”

“లేదు..లేదు.. నేను వెళ్తాను మధు…” ఇలా వాళ్ళు గొడవ మొదలుపెట్టి పావుగంట పైన అయింది. ఇప్పట్లో ఇది తేలేలా లేదు అన్నట్టు, వాతావరణంలో గాలి అసలు లేదు. కాసేపటికి రవి ఆపేసి “అది సరే కానీ నువ్వు తీసిన గొయ్యి ఎక్కడ?” అని అడిగాడు. దానితో మధు “చూపిస్తాను” అన్నట్టు తలపైకి కిందకి వూపి పైకి లేచి చీకటిగా వున్న ఒక మూలకి వెళ్ళి తను కప్పుకునే నల్లటి రగ్గు పైకి తీసాడు. రగ్గు కింద తను అన్నం తినే పళ్ళెం ఒకటి వుంది, దానిని తీసి చూపించాడు. అంతే ఒక్కసారిగా రవి కళ్ళు పెద్దవి చేస్తూ “వామ్మో యింత పెద్ద గొయ్యి తీశావు, అదీ ఎవరికీ అనుమానం రాకుండా అంటే…బ్రదరూ, నువ్వు నిజంగా గ్రేట్” ఆ పొగడ్తను ఏమాత్రం పట్టించుకోకుండా పళ్ళెం పెట్టేసి రగ్గు కప్పేసాడు. పైకి లేచి వెంటిలేటర్ లాగా వున్న చిన్న కిటికీ గుండా బయట వైపున వున్న పౌర్ణమి చంద్రుడిని చూస్తూ వున్నాడు. తనకు సీత గుర్తుకువచ్చింది. అతనికి చందమామను చూస్తూ వుంటే, అతను సీతకు చెప్పాలనుకున్న, ఇవ్వాలనుకున్న ముద్దులు అన్నీ చందమామను రాయబారి చేసి పంపితే బాగుండును అనుకున్నాడు. వెంటనే అతనికి తన చిన్నతనంలో చదివిన “మేఘ సందేశం” కథ గుర్తుకువచ్చింది. విరక్తితో నిట్టూర్చి తన చూపును పక్కకు మరల్చాడు. వెంటనే రవి”బ్రదరూ..ఎదో ఒకటి డిసైడ్ చేయి… మనం ఇక్కడ యావజ్జీవ శిక్షకు వచ్చాము, ఇంతకీ నువ్వు తెప్పించిన బాంబ్ సంగతేంటి…అన్నాడు మధు.

అదీ రెడీయే…నువ్వు, నేను తప్ప అన్నీ రెడీయే, ఇంతకీ అసలు ప్లాన్ ఏంటి? ముందు అది చెప్పు” అన్నాడు. దానికి మధు మూలగా పడేసి వున్నఒక పేపర్ ని తీసి అతనికి చెప్పడం ప్రారంభించాడు.

“ఇది నేను తీసిన గొయ్యి… సుమారు ఆరున్నర అడుగులు వుంటుంది. ఆ గొయ్యి కూడా U-ఆకారంలో ఉండేలా ముందు కొంచెం నేల లోపలికి తవ్వి మళ్ళీ పైకి తవ్వాను కొంచెం దూరం. అంటే దాదాపు మనం వున్న సెంట్రల్ జైల్ గోడకి కొద్దిగా అవతల వైపు దాకా, ఇక్కడి నుండి నువ్వు బయట నుండి తెప్పించిన బాంబ్ వల్ల నేల ఉపరితలానికి ఎంత దూరంలో చేరుకుంటాం అనేది చూడాలి. ఇంతకీ ఆ బాంబ్ రేంజ్ ఎంత?”

“వాడు చెప్పిన దాని ప్రకారం చూస్తే పది అడుగులు అన్నాడు బ్రదరూ.”

“పది అడుగులు అంటే మనం దాదాపు నేలపైకి కన్నం పడేలా ఏర్పాటు చేయచ్చు.”

“సూపర్ బ్రదర్.”

మొత్తం మనకి పావుగంట టైం పడుతుంది. ఆ కన్నం గుండా వెళ్ళి అక్కడ బాంబ్ పెట్టి పేలిస్తే, దాని నుండి మళ్ళీ బయటికి రావటానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది. ఈలోపు పోలీసులు రావటానికి దాదాపు పావుగంట పడుతుంది. గుంట చిన్నది కాబట్టి మొదట వెళ్ళేవాడు దాదాపు సేఫ్…రెండోవాడు వచ్చేసేలోపు పోలీసులు వచ్చే ఛాన్స్ వుంది. సో… ప్లాన్ నాది, గుంట తీసింది నేను కాబట్టి ఫస్ట్ నేను బయటకు వెళ్తాను. తరువాత నువ్వు… ఇద్దరూ ఒకేసారి వెళ్ళటానికి వీలులేనంత చిన్న గొయ్యి ఇది” అని మధు ప్లాన్ చెప్పాడు. దానికి రవి “అబ్బా..నువ్వు వెళ్తూవుంటే బై..బై..చెప్తూ నేను ఇక్కడే వుండి సెండ్ ఆఫ్ ఇవ్వాలా? బ్రదరూ…బాంబ్  ఎరేంజ్ చేయించింది నేను కాబట్టి నేను వెళతాను ఫస్ట్.”

మధు కొంచెం కోపంగా “రవీ..నేను వెళ్ళటం చాలా ఇంపార్టెంట్.. అర్ధం చేసుకో”, “నేను ఏమన్నా జైలు నుండి తప్పించుకొని గోళీలు ఆడుకోవాలా? నాకు అర్జంటే..నాకు ఇంపార్టెంటే”, “ఛ..” అని విసురుగా అనేసి అటు యిటూ పచార్లు చేస్తున్నాడు. రవిని ఎంత కన్విన్స్ చేసిన వినిపించుకోవట్లేదు. ఇద్దరు స్నేహితులు కాదు..ఏమీ కాదు, జైలులో కలిశారు. ఇద్దరికీ జైలు నుండి తప్పించుకోవడమే లక్ష్యం… ఎవరూ తగ్గట్లేదు.

చాలాసేపు వారి మధ్యలో మౌనం చోటుచేసుకుంది. వాతావరణంలో మార్పులు రావటం మొదలెట్టాయి. మధు భాదను అర్థం చేసుకున్న దానిలా సీతకు, అతని గురించి చెప్పటానికా అన్నట్టు ఆకాశంలో చంద్రుడు మాయమయ్యాడు. నల్లని మబ్బులు కమ్మేశాయి.

కాసేపటికి రవి “బ్రదరూ..నాదొక ఐడియా” అన్నాడు. ఏమిటన్నట్టు చూశాడు మధు.

“సిల్లీగా వుంది అనకు. ఇంతకుమించి దారి నాకు దొరకలేదు. నువ్వు ఇందాక అన్నట్టు నీ అర్జన్సీ ఏంటో నువ్వు చెప్పు. అదే నువ్వు ఎందుకు బయటకు వెళ్ళాలి అనుకుంటున్నావో చెప్పు. నేను ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానో చెప్తాను. మన మనః సాక్షికి ఎవరు వెళ్ళటం కరెక్ట్ అని అనిపిస్తుందో అదే చేద్దాం, ప్లాన్ ఎలా వుంది?”

ఒక రకంగా ఐడియా బాగానే ఉన్నట్టు అనిపించింది. అక్కడే ఇరుక్కుపోయి ఉండటం కంటే ఎదో ఒక స్టెప్ తీసుకున్నట్టు అనిపించింది. అదే బెటర్ ఆప్షన్ అనిపించింది. కానీ, వెంటనే సందేహంతో “నువ్వు ఒకవేళ కథలు విన్నాక నావైపు చెప్పకుండా అబద్దం ఆడితే?” అన్నాడు మధు. దానికి రవి “హ హ్హా హ్హా..” బ్రదరూ మనం ఖైదీలయినంత మాత్రాన మన మనఃసాక్షి కూడా అబద్దమే చెప్తుందంటావా? నాకు అబద్దం ఆడటం చేత కాదు కాబట్టే ఇలా శిక్షపడి జైల్లో వున్నాను. లేకపోతే ఎపుడో కోర్టు నుండి బయటికి వెళ్లిపోయే వాడ్ని, జైలు దాకా కూడా రాకుండా.

“సరే అయితే నాకు ఒకే..ఎవరు చెప్పాలి ముందు” అన్నాడు మధు.

“నేను చెప్తాను..ఇంకొక విషయం, మనం ఎందుకు బయటికి వెళ్ళాలి అన్నది మాత్రమే చెప్పుకోవాలి. ఎలా లోపలికి వచ్చాము అనేది వద్దు. చెప్పవద్దు. సరేనా?”

“ఎందుకు”

“ఎందుకంటే .. ఈ జైల్లో వున్న వాళ్ళందరిదీ ఒక్కో రకమైన కథ. మనం వినలేం కదా. దానికి తోడు ఎలాంటి పని చేసి లోపలికి వచ్చాము అన్నది చెప్పేస్తే మన మీద ఒక నెగటివ్ ఇంప్రెషన్ వచ్చేసి, ఇలాంటి పని చేసిన వాడు బయటికి వెళ్ళకపోవటమే కరెక్ట్ అనిపించి మన ఒపీనియన్ మార్చేసుకోవచ్చు కదా…”

“హుమ్…అవును..అవును..”

“సరే, నా కథ చెప్తాను విను ఫస్ట్”

జైలు గోడలు

నాపేరు రవి.. రొటీన్ గా వుండే కథే అయినా చాలా రెగ్యులర్ గా జరిగే కథే ఇది. నేను కాలేజీ లో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు సావిత్రి. పేరుకు తగ్గట్టు గానే చాలా అందంగా వుంటుంది ఆ అమ్మాయి కూడా. సముద్రంలో దొరికే ఆల్చిప్పల్లో వుండే ముత్యాల్లాంటి కళ్ళకు, కటిక చీకటి లాంటి కాటుక, బాపు గారి బొమ్మల్లో అమ్మాయిలకు మాత్రమే ఉండే అందమైన ముక్కు లాంటి ముక్కు. దానికి చిన్న నక్షత్రం లాంటి ముక్కుపుడక, ముక్కుకు కుడి పక్కగా చిన్న పుట్టుమచ్చ. నవ్వితే చాలు కనిపించే అందమైన బుగ్గకు సొట్టలు…ఇంకా”

“రవీ.. టైం లేదు ఎక్కువ”

“సారీ బ్రదరూ తనను గుర్తు చేసుకున్నా కూడా ఎదో తెలియని తన్మయత్వం. అలాంటి అమ్మాయిని రోజూ చూసేవాడ్ని, ఫాలో చేసేవాడ్ని. మాట్లాడే ధైర్యం మాత్రం ఉండేది కాదు. రోజూ ఇదే తంతు. తన వెనుక వెళ్ళటం, మాట్లాడకుండా వచ్చేయటం. ఒకరోజు చూసి చూసి తన దగ్గరగా వెళ్తుంటే, తనే “హలో…ఎన్నాళ్ళు తిరుగుతారండీ వెనకాల…మాట్లాడరా..? అన్నది. నేను కొంచెం టెన్షన్ గా తడబడుతూ, నవ్వుతూ అక్కడ నుండి పారిపోయాను. నా గుండె వేగం నాకు తెలిసిన క్షణమది. తరువాత తనే, నన్ను చూస్తూ నేను నడిచే దారిలో నిలబడి వుంది. ధైర్యం చేసి తన దగ్గరగా వెళ్ళాను. వెంటనే సావిత్రి “చూడండి.. ఐ లవ్ యూ.. అర్ధం తెలుసుగా.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అన్నది. నాకు ఏమీ అర్ధం కాలేదు. ఏం  చెబుతున్నది ఈ అమ్మాయి. నేను కదా చెప్దాం అనుకున్నది. వెంటనే తేరుకొని “అదేంటండి నేను చెప్దాం అని వచ్చాను అంది. ఈలోపే మీరే చెప్పేశారు” అన్నాను. “ఈలోపే అంటే ఆలోపే నాకు అరవై సంవత్సరాలు వచ్చేస్తాయేమో అని భయం వేసి చెప్పేశానండీ.” అయినా మీ ఫ్రెండ్ గోపి మొత్తం చెప్పాడు లెండి. మీ గురించి అన్నీ తెలుసుకున్నాకే మీకు ఇలా ఐ లవ్ యూ చెప్పానండి” అని నవ్వుతూ నిలబడ్డది. తనను అలా అంత దగ్గరగా నవ్వుతూ ఉండడం చూస్తుంటే నాకు ఎంతో హాయిగా అనిపించింది. తను ప్రక్కన “లేకపోతే ప్రాణం పోతుందా?” అన్నట్టు తోచింది నాకు. వెంటనే తనను దగ్గరగా తీసుకున్నాను. దూరం నుండి మొత్తం చూస్తూ నిలబడ్డ సావిత్రి తండ్రికి చాలా కోపం వచ్చింది. ఇంటికి వచ్చాక సావిత్రిని ఎడాపెడా చివాట్లు పెట్టాడు. తల్లి అడ్డు రావటంతో సావిత్రికి దెబ్బలు తప్పాయి. కానీ తన ప్రవర్తనలో ఏ మార్పు లేదు. రహస్యంగా నన్ను కలిసేది. చాలా ప్రదేశాలు తిరిగేవాళ్ళం. ఇద్దరం అలా చేయి చేయి పట్టుకొని చుట్టూ వున్న జనాన్ని కూడా మర్చిపోయేవాళ్ళం. అలా చాలా కాలం జరిగింది. ఇద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. ఒకళ్ళనొకళ్ళం వదిలి ఉండలేనంత దూరం వెళ్ళిపోయాము. మా ప్రేమ లాగే మా మీద కోపం కూడా పెరుగుతూ వచ్చిన సావిత్రి వాళ్ళ నాన్న నాకు కూడా చెప్పి చూశాడు “తన కూతురిని మళ్ళీ కలిస్తే బాగొదంటూ.” నేను వినకపోవటంతో భార్య, సావిత్రితో పాటు ఇల్లు ఖాళీ చేసి వేరే వూరు తీసుకు వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి అలవాటయింది ఒంటరితనం, బాధపడటం, తన కోసం చాలా వెతికాను. చుట్టు ప్రక్కల వూర్లన్నీ తిరిగాను. కానీ లాభం లేదు. ఎటు వెళ్ళినా తన జ్ఞాపకాలే. ఎటు చూసినా మేము ఇద్దరమే కనపడేవాళ్ళం. కాలేజీ పూర్తి అయింది. అక్కడ వుండలేక వూరు మార్చేశాను. కాలం, చలికాలం పగటిపూట లాగా వేగంగా గడిచిపోయి ఆరు సంవత్సరాలు అయింది. కానీ నాకు మాత్రం తనను మర్చిపోవటం కుదర్లేదు. చివరికి ఉద్యోగం కోసం ఈ వూరు వచ్చాక ఒక రోజు తను కనబడింది. నువ్వు నమ్మవు బ్రదరూ..అచ్చం నేను లాస్ట్ టైం చూసినపుడు ఎలా వుందో అలాగే వుంది. చుట్టూ మార్కెట్లో అంతమంది వున్నారు అని కూడా చూడలేదు. గట్టిగా తనను దగ్గరగా తీసుకున్నాను. తన కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లు నా షర్ట్ మీద పడి, చల్లగా నాకు తగలటం గమనించాను. “ఏమయిపోయావ్? ఎలా వున్నావ్?” అదీ ఇదీ అని చాలా ప్రశ్నలు వేశాను. ఎంత ధైర్యంగా ఉండేదో చాలా బేలగా అయిపోయింది.

కాసేపటికి తనని తీసుకొని వెళ్ళిపోమని అడిగింది. నాకు వెంటనే వాళ్ళ నాన్న గుర్తుకువచ్చాడు. ఆయన ఉంటే మమ్మల్ని కలవనివ్వడని నాకు అర్ధం అయిపోయి “రేపు వెళ్లిపోదామా?” అన్నాను. “లేదు..లేదు..ఒక్క పది రోజులు అంటే సరిగా జూన్ 1  తారీఖు రాత్రి నువ్వు రా.. వెళ్ళిపోదాం.. ఈలోపు నాకు చిన్న పని వుంది. ఏం పని మొత్తం అంతా ఈసారి కలిసినపుడు చెప్తాను. ఇంట్లో నాన్న వున్నాడు. నేను వెళ్తున్నాను.” అని గబగబా చెప్పేసి వెళ్ళిపోయింది. అలా ఆశ్చర్యంగా నిలబడిపోయాను నేను. ఇవాళ జూన్ 1 . నేను ఎక్కడికి రావాలో చెప్పింది. తనను వెళ్ళి ఈసారి కూడా కలవకపోతే లైఫ్ లో కలవలేము మేము. ఇదే నాకున్న ఆఖరి అవకాశం అందుకే బ్రదరూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అర్ధం అయిందా నా పరిస్థితి? “అయింది నీకోసం ఎదురుచూస్తూ ఒక అమ్మాయి వుంది. అంతే కదా…కానీ, నాకోసం ఎదురుచూస్తూ ఒక అమ్మాయి ప్రాణం వుంది.”

“అర్ధం కాలేదు బ్రదర్…”

“చెప్తాను విను.”

“సీత…తనంటే నాకు చాలా ఇష్టం, ఎంతంటే ఈ ప్రపంచంలో ఈర్ష్య, ద్వేషం, స్వార్ధం ఎంతయితే పేరుకుపోయున్నాయో అంతకు వందరెట్లు ఇష్టం. నా ప్రాణం కన్నా ఎక్కువ తను, సీత..తనే నా కూతురు. ఐదేళ్ళు. తను పుట్టకముందు నా జీవితం వేరు. తను పుట్టాక నా జీవితం వేరు. నా భార్య పెదవుల మీద చిరునవ్వు చూడటం కన్నా.. నా కూతురు కళ్ళలో నీళ్ళు రాకుండా చూడటమే నాకు ముఖ్యం. ఎదో బ్రతుకు తెరువు కోసం ఎదో చిన్న వుద్యోగం చేస్తున్న నాకు అందరి మగవాళ్ళ లాగే తల్లిదండ్రుల వల్ల పెళ్ళి అయింది. నా భార్య నన్ను చక్కగా చూసుకున్నప్పటికీ, సీత పుట్టుకతో నా జీవితంలో వెలితి అనేది లేకుండా పోయింది. తనను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవాడిని. ఒక రోజు సడన్ గా తన రెండేళ్ళ వయసులో కళ్ళు తిరిగి పడిపోయింది. పరుగు పరుగున తనను హాస్పిటల్ కి తీసుకువెళ్ళాను. డాక్టర్ ఏదో చాలా చెప్పాడు. నాకు ఏమి వినబడటం లేదు. అర్ధం కాలేదు, తనకు ఆపరేషన్ చేయాలన్న విషయం తప్ప. లేదంటే తన ప్రాణానికే ప్రమాదం అని ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకు ప్రపంచం అంతా ఆగిపోయినట్టు అనిపించింది. నా కళ్ళ ముందు ఏమీ కనబడలేదు. సడన్ గా నా భార్య వచ్చి నా గుండెల మీద పడి ఏడవటంతో నేను ఈ లోకానికి వచ్చాను. నాకు కూడా గుండెలవిసేలాగా గట్టిగా ఏడవాలనిపించింది. కానీ ఆ టైం లో నా భార్యను ఓదారుస్తూ ఏడవటం కూడా మరచిపోయాను. తరువాత డాక్టర్ ప్రస్తుతానికి మెడిసిన్ ఇస్తాను. కొన్నాళ్ళు చూద్దాం నయం కాకపోతే ఆపరేషన్ తప్పదు అన్నాడు. అప్పటిదాకా బ్రతుకు తెరువు కోసం చేసిన ఉద్యోగాన్ని రూపాయి, రూపాయిని దాస్తూ కావాల్సిన మెడిసిన్ కొంటూ తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాను.

రాత్రుళ్ళు కూడా ఎదో చిన్నపాటి ఉద్యోగంలో చేరాను. వచ్చే డబ్బు తక్కువైనా…ఎందుకైనా ఉంటుంది కదా అని. కొన్నాళ్ళు బాగానే గడిచింది. తన పరిస్థితి కూడా మామూలుగానే వుంది. అంతా సవ్యంగా జరిగితే దేవుడికి నచ్చదు కాబోలు. సీత పరిస్థితి మళ్ళీ విషమించింది. తనను హాస్పిటల్ కు తీసుకువెళ్తూ అపుడు గ్రహించాను. తనను ఎపుడో ఎత్తుకొని ఆడిస్తూ అన్నం తినిపించడం గుర్తు…తరువాత ఏమీ గుర్తు లేదు. తను ఇలా నడుస్తూ వున్నది నా ప్రక్కన. ఏమన్నా గుర్తుండటానికి తనతో నేనుంటేగా అసలు. పరిస్థితులు, సమస్యల వల్ల సంపాదించడం పనిలో పడి నా ప్రాణానికి ప్రాణం అయిన నా బిడ్డతో కూడా గడపలేకపోయాను. ఒక్కసారిగా కళ్ళవెంట నీళ్ళు జారాయి. వాటిని తుడుచుకొని వెంటనే డాక్టర్ ని కలిసి తన పరిస్థితిని అడిగాను. డాక్టర్ ముందుగా చెప్పినట్టు గానే “చెప్పానుగా మధు…ఆపరేషన్ చేయించాలి అని. ఆ టైం వచ్చింది. చేయించాలి” అన్నాడు. దానికెంత ఖర్చు అవుతుందో చెప్పాడు. నా గుండె ఆగినంత పనయింది. నా జీవితంలో అంత సంపాదించాలి అంటే రెండు సంవత్సరాలు వుద్యోగం చేసి దాచాలి. అయినా కళ్ళ ముందు అంత టైం కూడా లేదు. “సరిగా మూడు నెలల్లో ఆపరేషన్ చేయించకపోతే తన ప్రాణాలు..”పూర్తి చేయలేదు డాక్టర్. చేయక్కర్లేదు కూడా. నాకే అర్ధం అయింది. మెల్లగా నడుచుకుంటూ తనను పడుకోబెట్టిన బెడ్ దగ్గరికి వెళ్ళాను. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ తో కళ్ళలో నీళ్ళు తిరుగుతూ చుట్టూ చూస్తూ నన్ను చూసి “నాన్నా…నేను బ్రతకనా? అమ్మతో నీతో ఆడుకోనా?” అన్నది. అంతే ఆ మాటలకి నాకేం సమాధానం చెప్పాలో తెలియక తనను దగ్గరికి తీసుకొని “నీకేం కాదు తల్లీ.. నేనున్నానుగా..నాన్న ఉన్నాడురా..” అని చెప్పి అక్కడ నుండి బయటికి వచ్చాను. అపుడే నిర్ణయించుకున్నాను, నా పాప బ్రతకడం కోసం ఏదయినా చేద్దామని. అలాగే జైలుకి వచ్చాను. పోయిన నెల నా ఫ్రెండ్ ఒకడు వచ్చి చెప్పాడు “ఈ వారంలో ఆపరేషన్ చేయించాలి” అని, అందుకే..అందుకే నేను బయటకు వెళ్ళి తనను కాపాడుకోవాలి అని ఇక్కడకి వచ్చిన దగ్గర్నుంచి ప్రయత్నిస్తూనే వున్నాను అని చెప్పడం పూర్తిచేసాడు మధు. మొత్తం కథ విని రవి “మరి ఆపరేషన్ కి డబ్బు ఎలా?” అన్నాడు.

“హుమ్..తెలియదు. తనను కాపాడుకోవాలి అన్న కోరిక తప్ప నా దగ్గర ఏమీ లేదు” అన్నాడు మధు. మొత్తం విని గట్టిగా నిట్టూర్చి ఎదో ఆలోచనలో పడ్డాడు రవీ. ఇద్దరి మధ్యా మౌనం మళ్ళీ. కాసేపటికి రవి “నా కథ ఫస్ట్ చెప్పటం వల్ల కావచ్చు. నీ కథలో ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు నా మనఃసాక్షి నిన్ను వెళ్ళమనే చెప్తుంది. ఇందాక నువ్వు చెప్పినట్టు నా కోసం ఒక మనిషి ఎదురుచూస్తుంది. కానీ నీ కోసం ఒక ప్రాణం ఎదురుచూస్తుంది. నువ్వే వెళ్ళు బ్రదరూ.. నాదేం వుంది, ఆ అమ్మాయి లేకుండా ఆరేళ్ళు వున్నానుగా అలాగే వుంటాను. నువ్వు బయల్దేరు బ్రదర్ అన్నాడు. మధు, రవిని గట్టిగా హత్తుకొని “థాంక్యూ ..థాంక్యూ వెరీ మచ్” అని బయలుదేరటానికి సిద్దమయ్యాడు. బయట బాగా మబ్బులు పట్టాయి.

సమయం: 09:45 నిమిషములు

మధు మరి ఆలస్యం చేయకుండా బాంబు తీశాడు. అక్కడ చీకట్లో కప్పిన రగ్గుని తీసేసి, పళ్ళెం ప్రక్కకి తీసి గుంతలోకి దిగటం మొదలెట్టాడు. అది ఒకడు మాత్రమే సరిపోయేంత గుంత. మెల్లిగా దిగి అక్కడ బాంబు పెట్టడానికి సిద్దమయ్యాడు. సరిగా అదే సమయానికి రవి జైలు తలుపు దగ్గర  నుంచోని ఎవరన్నా వస్తున్నారేమో చూస్తున్నాడు. మొత్తం చీకటి, నిశ్శబ్దం. జైలర్ కూడా అన్నం తినే సమయం. ఎటువంటి శబ్దం రాకుండా మధు బాంబు ఫిక్స్ చేసి మళ్ళీ పైకి వచ్చి రవితో ఫిక్స్ చేశాను. అది పేలాక అవతల పక్క నేల ఉపరితలభాగం తెరచుకుంటే నేను వెళ్ళిపోగలను. ఇక అంతా దేవుడి పైనే భారం వెయ్యడమే. పోలీసులు రావటానికి పదిహేను నిమిషములు పడుతుంది, బాంబు సౌండ్ విని. కాబట్టి ఈలోపు వెళ్ళిపోతాను. మరి నువ్వు రవీ?..” అనగానే ఆలోచనలో పడి వెంటనే ఐడియా వచ్చినవాడిలా అతని తలని గోడకేసి కొట్టుకోవడం మొదలెట్టాడు. రెండు దెబ్బలకి రక్తం కారుతూ వుంది. మధు ఏం జరుగుతుంది అని చూసే లోపల అతని తల నుండి రక్తం ధారగా కారుతూ వుంది. “రవీ..రవీ.. ఏమిటిది?”

“నువ్వు పారిపో బ్రదరూ..నన్ను కొట్టి పారిపోయాడు అని చెప్తాను” అన్నాడు. అలాంటి టైం లో కూడా అతనికి సహాయం చేస్తున్న రవిని చూస్తూ “థాంక్స్ రవీ..కానీ…”, “నువ్వేం మాట్లాడకు..బయల్దేరు..నేను రిమోట్ నొక్కుతాను..” అని తన చేతిలో వున్న చిన్న రిమోట్ ని నొక్కడంతో పెద్ద శబ్దంతో బాంబు పేలింది. మధు ఆలస్యం చేయకుండా వెంటనే గొయ్యిలో దూరటం మొదలెట్టాడు. మొత్తం పొగ అతని ఊపిరితిత్తుల్లోకి పోతుంది. దగ్గుతున్నాడు. అయినా ఆగట్లేదు. ముందుకు వెళ్తూ వున్నాడు. అతను వున్న ఆఖరి అవకాశాన్ని వదలదలచుకోలేదు. జైల్లో శబ్దానికి కలకలం మొదలయింది. ముందు ఆ శబ్దం ఏమిటో ఎవరికి అర్ధం కాలేదు. కానీ సైరన్ మోగించారు. జైలర్స్ అందరూ అలర్ట్ అయ్యారు. సెంట్రీలన్నీ వెదకటం ప్రారంభించారు. మధు అలా వెళ్ళి వెళ్ళి ఒకచోట ఆగిపోయాడు. నేలపై భాగాన వరకు బాంబు రేంజ్ రాలేదు. మొత్తం వృధా అయిపోయిందనుకున్నాడు. చేత్తో గట్టిగా గుద్దటం మొదలుపెట్టాడు. కళ్ళల్లో దుమ్ము పడుతున్నా అతను లెక్క చెయ్యట్లేదు. అదృష్టం ఏంటంటే నేల ఉపరితలానికి, అతను ఉన్న ప్లేసుకు సుమారు అరడుగు మాత్రమే ఉండటంతో అతను చేత్తో గుద్దటం వల్ల, మట్టిని లాగేస్తూ ఉండటం వల్ల నేల పైభాగానికి వచ్చేశాడు. బయటికి వచ్చేశాడు. లేచి నిలబడి చుట్టూ చూశాడు. అక్కడ నుండి పావుగంట పరిగెడితే చాలు అతను బయటికి వచ్చేసినట్టే. బాగా గాలి వీస్తుంది. వర్షం మొదలయ్యే లాగా వుంది. అతను బయల్దేరుతున్న టైం లో అతను వచ్చిన గొయ్యి నుంచి దగ్గు వినపడుతూ ఉండటంతో ఆగి కిందికి చూశాడు. ఎదురుగా రవి దగ్గుతూ”బ్రదరూ..బ్రదరూ..చెయ్యి..చెయ్యివ్వు” అన్నాడు. మధు ఆశ్చర్యంతో రవిని బయటికి లాగి “రవి..నువ్వెలా వచ్చావు: పోలీసులు రాలేదా?”, “నువ్వు ఇందాక చెప్పిన ప్లాన్ లో పోలీసులు రావటానికి పావుగంట పడుతుంది అన్నావ్. వాళ్ళు వచ్చేసేవాళ్ళే. కానీ అసలు ఏ సెంట్రీలో, ఏం జరిగిందో తెలియదు కదా..వెతుక్కుంటూ వచ్చేటప్పటికి టైం పడుతుంది అని తెలుసు, అందుకే నేను వచ్చేశాను” అన్నాడు. మధు, రవిని గట్టిగా కౌగలించుకొని “పద వెళ్ళిపోదాం” అని పరుగెత్తటం మొదలెట్టారు. ఇద్దరూ పావుగంట పరుగెత్తిన తరువాత, ఒక రోడ్డులో ఆగిపోయారు. జనసంచారం బాగా వున్న ఏరియా అది. ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. రవి -ఇంతలో “బ్రదరూ..ఇక్కడ నుండి నీదారి నీది, నాదారి నాది. నువ్వు ఎటు వెళ్తున్నావో కూడా చెప్పకు, నేను చెప్పను. ఎందుకంటే పొరపాటున నేను పోలీసులకు దొరికితే చిత్రహింసలు పెడితే నువ్వు ఎక్కడ వున్నావు? అనేది చెప్పేయొచ్చు. అలాగే నీ విషయంలో కూడా అంతే. కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా హ్యాపీ గా వుండు. సీత జాగ్రత్త” అని చెప్పేసి మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాసేపటికి చీకట్లో కలిసిపోయాడు.

ఉరుములు, మెరుపులు బాగా ఎక్కువ అవటంతో వాన ఉధృతం ఎక్కువయింది. మధు పరుగు పరుగున అతని ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో మొదట కంగారు పడ్డాడు. తరువాత ఇంటి పక్కనున్న వాళ్ళ ద్వారా పాపని హాస్పిటల్ లో చేర్చారు అనీ, ఉదయమే ఆపరేషన్ అయిపోయిందని పాప ఇపుడు క్షేమంగా ఉందని తెలుసుకున్నాడు. మధుకు ఏమీ అర్ధం కాలేదు. “అంత డబ్బు ఎక్కడిది? అసలు”. తన భార్య అప్పు తెచ్చి ఉంటుందా? లేక ఎవరు సహాయం చేసి వుంటారు? ఇలాంటి రకరకాల ప్రశ్నలతో వానలోనే హాస్పిటల్ కి మొదలయ్యాడు. మొత్తంగా తడిసిపోయాడు. బట్టలన్నీ ముద్దయిపోయాయి. లోపల రిసెప్షనిస్ట్ లో పేరు అడిగి రూమ్ ఎక్కడ వుందో కనుక్కొని వెళ్ళాడు. లోపలకి రమ్మన్నట్టు సైగ చేశాడు డాక్టర్. తన కూతురి పరిస్థితి ఇప్పుడు బాగుంది అన్నట్టు చెప్పాడు. అతనికి చేతులెత్తి దణ్ణం పెట్టాడు. “మధు మీరు మీ పాపతో మాట్లాడొచ్చు” అని డాక్టర్ అనటంతో, సీత దగ్గరగా వెళ్ళి మంచం మీద కదలకుండా పడుకొని వున్న పాపతో “సీతా..” అన్నాడు. “నాన్న నాకు తగ్గిపోయిందట” అంటూ మత్తుగా ముద్దుగా పలికింది. అతనికి ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు తిరుగుతూ వున్నాయి. “నాన్నా..నాన్న..”అని సీత ఒక కవర్ మధు చేతిలో పెట్టింది. “ఏంటమ్మా ఇది?” అన్నట్టు చూసి కవర్ ఓపెన్ చేశాడు. అందులో ఒక వుత్తరం వుంది. అతని భార్య సావిత్రి రాసింది తనకు. చదవటం మొదలెట్టాడు.

ప్రియాతి ప్రియమైన,

క్షమించండి, ప్రియాతి ప్రియమైన లాంటి పెద్ద పెద్ద పదాలు ఎపుడూ లేవు మన మధ్య. పాపకి ఉదయమే ఆపరేషన్ అయింది. ఈ ఆపరేషన్ డబ్బుకోసం మీరు చాలా కష్టపడ్డారు అని తెలుసు. మీ భార్యగా ఆరు సంవత్సరాలు నుంచి మీ కష్టాల్లో పాలుపంచుకున్నాను. నిజానికి కష్టాల్లోనే పంచుకున్నాను. ఎందుకంటే సుఖం అనే మాట విన్నా కూడా చాలా కొత్తగా వుంది. ఇలాంటి సమయంలో కూడా నేను మీ తోడుగా వుండి మీ మెడకు గుది బండలాగా తయారవ్వలేను. అందుకే కాలేజీ రోజుల్లో నేను ప్రేమించిన, పెళ్ళి చేసుకుందామని అనుకొని మా నాన్న వల్ల వీలుకాక విడిపోయిన రవి అనే అతనితో వెళ్ళిపోతున్నాను. అతన్ని మొన్నీ మధ్యనే మార్కెట్ లో కలిశాను. అతను నన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే వున్నాడు. అందుకే నేనీ నిర్ణయానికి వచ్చాను. నన్ను క్షమించండి. సీత జాగ్రత్త. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని తెలుసు. తనని మీరే నాకన్నా బాగా చూసుకుంటారు అని తెలుసు. ఉంటాను. ఆపరేషన్ డబ్బు ఈ లెటర్ తో పాటు వుంచాను.

ఇట్లు,

ప్రేమతో(వుందో లేదో తెలియకపోయినా)

మీ (ఒకప్పటి) సావిత్రి.

ఉత్తరం మొత్తం చదివేటప్పటికి మధుకి కళ్ళు తిరిగిపోయాయి. కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. ఉత్తరంతో పాటు బరువుగా తగలటంతో కవర్ లో చూశాడు. సావిత్రి మెడలో ఉండాల్సిన తాళి, అతను అగ్నిసాక్షిగా కట్టిన తాళి. దాన్ని తీసుకొని చూస్తూ అలా నిలబడిపోయాడు. బయట పెద్దగా ఉరుములు, మెరుపులు, శబ్దాలు. సీత చిన్నగా “నాన్న..అమ్మ ఎక్కడ నాన్నా?” అని అడిగింది. అతనికి సావిత్రి, ముక్కు, ముక్కుకి ముక్కు పుడక, ప్రక్కనే వున్న  పుట్టుమచ్చ గుర్తుకు వచ్చింది. కానీ బుగ్గన సొట్ట మాత్రం గుర్తుకు రాలేదు. ఎందుకంటే తను ఎప్పుడు నవ్వలేదు అతనితో వున్నప్పుడు.

రచన: జైలు గోడలు
వ్రాసిన వారు: జైమిని సాయి సురేకుచ్చి
స్థలం: తెనాలి
ట్విట్టర్: @JaiSurekuchi

Comments

comments