చంద్రన్న, జగనన్న, పవనన్న, పిడక పెంటయ్య!!!

ఒక పిడక ఈ గోడ నుండి ఆ గోడకి వెళ్లి అంటుకుంది, ఆ గోడ మీద పిడక ఎటు వెళ్దామా అని ఆలోచిస్తుంది, ఇంతలో ఇంకో పిడక తన గోడ మీద ఉండే పిడకలను తిట్టిపోస్తూ తనకి నచ్చిన గోడని కౌగిలించుకుంది . ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకి అర్ధం కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో రాజకీయం, ఎన్నికలకు చేరిందని. ఇవన్నీ గమనిస్తున్న పిడక పెంటయ్యకి ఒకటి అర్ధం అయింది [ఆయనకి పిడక బాష వచ్చులెండి], ఈ రాష్ట్రం మూడు “అ” ల మధ్య నలిగిపోతుంది – అతిశయోక్తి, అత్యాశ, అస్థిరత్వం.

పిడక పెంటయ్య

చంద్రన్న అతిశయోక్తి

హేమాహేమీలు, రాజకీయ పండితులు ఉన్న ఒక పార్టీ ఇన్ని విమర్శలు ఎదుర్కోవడం బహుశా స్వయంకృతమే అయుండొచ్చు. పెంటయ్య [అంటే నేనే] చెప్పినట్లు – “పేడ పిసికితే బంగారం ఎట్టొస్తాది సామి”. తెలుగు దేశం “నారల్ని” [అవును, చిన్న నారే] పక్కనబెట్టి సమర్ధవంతమైన వారికి బాధ్యతలు ఇచ్చివుంటే రాష్ట్ర ప్రగతి ఇలా జరుగుతుంది అని ప్రజలకు ప్రభావవంతంగా చెప్పే వారేమో. ఇది కాకుండా, పాత నోట్ల రద్దు దగ్గర నుండి పాలపుంతలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో కనిపెట్టే అంశం వరకు అన్నీ నేను చెప్తేనే జరిగాయని ఒక ముఖ్య మంత్రి చెప్పడం అతిశయోక్తులకే అతిశయోక్తి. దీనికి తోడు పేడని కూడా కబ్జా చేద్దాం అనుకునే గంటలు, కనిపించిందంతా నారాయణ నారాయణ అని స్వాహా చేసే వివేకవంతులు, గొప్ప చరిత్రగల తెలుగు దేశాన్ని అభాసుపాలు చేస్తున్నాయి.

క్లుప్తంగా: సొంత మేధస్సును ప్రశంసించుకుంటూ, రాష్ట్రంలో జరిగే కొన్ని అన్యాయాలను సరైన పద్దతిలో ఎదుర్కోలేకపోయిన పాలక వర్గం.

జగనన్న అత్యాశ

“వై ఎస్” అనే బ్రాండ్ ని సొంతం చేసుకుని, దాని చుట్టూ ఒక రాష్ట్రీయ పార్టీనే స్థాపించిన జగన్; కొద్ది రోజుల్లోనే అందరి లాంటి పార్టీయే ఇది కూడా అనేలా చేసుకున్నారు. కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా , వారిని వీరిని చేర్చుకుని ఒక నాయకుడు అయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. గత ఎన్నికలలో పరాజయం చవిచూసి, పంధాని మార్చుకోకుండా ఒకే ధోరణిలో వెళ్తున్నారు ఈనాటికి కూడా. ప్రజ్ఞావంతులు, ఉద్దండులు [అంబలి, బొచ్చి, జబర్దస్త్ కాజా లాంటి వాళ్ళు మినహాయింపు] ఉన్న వై సి పి, మంచి మార్గంలో వెళ్లుంటే రాష్ట్రంలో జనం బ్రహ్మరధం పట్టేవారు. అది వదిలేసి రాజకీయ ఆధిపత్యం కోసం అత్యాశ పడడం బాధాకరం. పెంటయ్య అందుకే అన్నాడు – “ఎంత పేడకి అంతే పిడక వస్తాది గాని, గోడ అంత పిడక యాడొస్తది సామి”. ఇవన్నీ కాకుండా ఆత్మహత్య చేసుకున్న ఒక రైతుని – బి సి రైతు చనిపోయాడు అనడం సగటు మనిషికి జీర్ణించుకోలేని విషయం. రైతు ఎక్కడైనా రైతే, కులం మతం అతనికి అతీతం, అందరికీ అన్నం పెట్టడానికి అతను పస్తులుంటాడు – అలంటి రైతుని ఒక సామజిక వర్గం మెప్పు కోసం కులాన్ని ఆపాదించడం హేయమైన చర్య.

క్లుప్తంగా: వ్యక్తిని దూషించకుండా, వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తి చూపుతూ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో పెట్టే అవకాశాన్ని వదులుకున్న ప్రతిపక్షం.

పవనన్న అస్థిరత్వం

జనసేన పూర్తిగా ఆవిర్భవించకుండానే తెలుగు దేశం వారికి మద్దతు ప్రకటించి అన్నను తలపించాడు పవన్ కళ్యాణ్. కొద్ది కాలంలోనే రాష్ట్రంలో ప్రతిపక్షం, ప్రభుత్వం చేయాల్సిన ఎన్నో పనులు తన భుజాల మీద వేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ భుజాలు నొప్పి వచ్చినపుడల్లా బరువుని దించడంతో ప్రజలకు జనసేన మీద ఒక రకమైన ఉదాసీనత ఏర్పడింది. ఉద్దానం వ్యవహారం మంచి పేరు తీసుకొచ్చినప్పటికీ, రాజధాని భూముల వ్యవహారంలో చాలా మంది అసంతృప్తిగానే ఉన్నారు. ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనుకకు వేస్తూ, జనసేన జనానికి నేస్తమా? పాలక వర్గానికి నేస్తమా? అనే సందేహం కలుగజేస్తుంది. పెంటయ్య ఎప్పుడూ అంటుంటాడు – “పేడ ఎండేలోపే పిడక కొట్టేయాలి సామి”. అవకాశం వచ్చినపుడే దూసుకువెళ్ళిపోయుంటే జనసేన ఈ రోజు మరో స్థాయిలో ఉండేది. ఇవి కాక, సొంత ప్రసార మాధ్యమం లేకపోవడం, అభిమానులనే ఎక్కువగా నమ్ముకోవడం, స్వవిషయాలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం, కేవలం సామాజిక మాద్యమాలనే నమ్ముకోవడం జనసేనను స్థిరత్వం లేకుండా చేస్తుంది. దీనికితోడు ఆగుబాబు ఒకరు, సందర్బాసందర్భాలు లేకుండా విమర్శల వర్షం కురిపించేస్తారు, దాని వలన ప్రజా రాజ్యానికి ఏ విధంగా నష్టం జరిగిందో, జనసేనకూ అదే నష్టం జరుగుతుంది.

క్లుప్తంగా: విశ్వరూపం ప్రదర్శించకుండా, పాడైపోయిన వాహనం లాగా డుగుడుగుడుగు అని తటపటాయించడం విచారకరం.

పిడక పెంటయ్య - andhra politics 2019

పిడక పెంటయ్య కొత్త పార్టీ

ఈ అవస్థను చూడలేక పిడక పెంటయ్య ఒక కొత్త పార్టీ స్థాపించాడు; అందులో అన్నీ అప్పుడే పిసికిన కొత్త పిడకలు, తెలివిగలవి, కుల-మత భేదాలు లేనివి, అందరిని సాధు భావంతో చూసే పిడకల్నే ఎంచుకుందాం అని నిశ్చయించుకున్నాడు. మీ అందరి ఓటు తప్పకుండా పెంటయ్య పార్టీకే వేయండి, ఇంతకీ పార్టీ పేరు చెప్పలేదు కదూ – ప్రజా పిడకలు.

గమనిక: ఇది కేవలం రాజకీయ విశ్లేషణ, ఒక సగటు మనిషి బాధ మాత్రమే, మేము ఏ పార్టీని ఇందులో సమర్ధించలేదు, మేము ఏ పార్టీకి  మద్దతుగా నిలవాలి అనుకోవట్లేదు [తటస్థులం]. భావాలను బాధపెట్టుంటే మన్నించండి, కానీ పిడక పెంటయ్య చెప్పినవి అన్నీ నిజాలే అని గ్రహించండి.

మీ ఓటు శక్తిని, విశ్లేషించి వాడుతారని ఆశిస్తూ…

మీ…

పిడక పెంటయ్య…

Comments

comments