నేటి భారతం మరియు నవ భారతం

నేటి భారతం

ఏమిటి ఈ నేటి భారతం
ఎటు వెళుతుందో ఏమిటో||
స్వాతంత్రం వచ్చిన తరువాతే
స్వాగతించారు అజ్ఞానాన్ని
స్వాతంత్రం వచ్చిన తరువాతే
తెర తీశారు కుల మతాలకు|| ||ఏమిటి||


గడప దాటిన ప్రతి వనితకు
లేనే లేదు స్వేచ్ఛ స్వాతంత్రం
అర్ధరాత్రి కాదుగదా
పగలే భయం ప్రతి క్షణం|| ||ఏమిటి||
రైతే రాజని అంటారు
రైతు కడుపుని కొడతారు
మధ్య తరగతి బతుకులకు
త్రిశంకు స్వర్గం చూపిస్తుంది నేటి భారతం|| ||ఏమిటి||

ఎటు చూసినా ఆకలి కేకలు,
అలమటింపుల పేదరికం
మరి నిదుర రాదుగా
ఏ ధనవంతునికి
ఏలనంటే అజీర్తి, దురాశ కల్గజేయు అజీర్తి|| ||ఏమిటి||

నేటి పౌరులే నీ రేపటి భవితంటుంటే
భయపడుతుంది భారత మాత హృదయం||
ఏమిటి ఈ నేటి భారతం
ఎటు వెళుతుందో ఏమిటో||

భారతం

నవ భారతం

కులమన్నది తెరపైకొచ్చెను
మానవత్వమే మంటగలిసెను|
రాజ్యాధికార దాహానికి ఊతం
ఆజ్యం అవుతుంది ఈ కుల భూతం||

చీడ పురుగులకు ముందున్నది, మరి
ఈ కుల పురుగుకు లేదే మందు|
కూటికి లేని అగ్రవర్ణంలో
దరిద్రానిదే అగ్రపీఠం, మరి
పనికి రాదుగా ఆ దరిద్రం
నా ఈ నవ యువ భారతంలో||

అగ్రవర్ణం అంటే ధనవంతులని
అన్యులంతా నిరుపేదలని|
ఎవరన్నారో తెలియదు కానీ
వాడికి తెలియదు ఆకలి భాద
అదే తెలుసుంటే|
ధనవంతులను అగ్రకులమని
పేద, మధ్య తరగతిని అన్యులని
ఖచ్చితంగా అనేవాడే||

ఎప్పుడు మారునో నా ఈ దేశం?
కులమతాల ఘర్షణ లేకుండా
శాంతి భక్తికి మార్గంగా
ఏనాడు సఫలమగునో నా నవ భారతం||

స్వతంత్రం సంపాదించిన సమయం నుండి భారత దేశం సాధించిన అభివృద్ధి కేవలం రాజకీయ నాయకుల ప్రగల్బాలలోనే తప్ప నిజమైన స్వతంత్రం ఈ నాటికీ రాలేదని విచారించే ఓ వ్యక్తి వేదనకు ప్రతిరూపాలు ఈ రెండు కవితలు. నిరాశ చెందుతూ సమాజంలో ఉన్న కుళ్ళును వేలెత్తి చూపే విధంగా, చివరికి సమాజానికి విముక్తి ఏనాడు కలుగుతుందో అని ఆశ్చర్యార్ధకంతో ముగించారు నేటి, నవ భారత కవితలను.

వ్రాసిన వారు:


అద్దంకి అనిల్ కుమార్,
Twitter: @AnilAddankiCA
అప్పాపురం గ్రామం,
నాదెండ్ల మండలం,
గుంటూరు.

Comments

comments