స్వర్గంలో రాక్షసుడు

ప్రతి మధ్యాహ్నం, బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, పిల్లలంతా ఆ రాక్షసుడి తోటలో ఆడుకునేవారు.

ఆ తోట చాలా విశాలమైనది, మెత్తని గడ్డితో, పూల మొక్కలతో, పండ్ల చెట్లతో నిండి పిల్లలకి అమితమైన సంతోషాన్ని ఇచ్చేది. పక్షులు చెట్ల కొమ్మల మీద వాలి పాటలు పాడుతుంటే, పిల్లలు ఆటలు ఆపి మరీ వాటి గొంతు విని కేరింతలు కొట్టేవారు.

స్వర్గంలో రాక్షసుడు

ఒకానొక రోజు పొరుగు దేశం వెళ్లిన రాక్షసుడు, తొమ్మిది సంవత్సరాల తర్వాత తన ఇంటికి చేరుకుంటాడు. పొరుగు దేశానికి ఎందుకు వెళ్లాడంటే, ఆ రాక్షసుడి పిన తండ్రి పెద్ద కూతురు అయిన ఒక రాక్షసికి ఒక పిల్ల రాక్షసుడు పుడతాడు. ఆ పిల్లాడితో ఆడుకుంటూ తెలియకుండానే అన్ని సంవత్సరాలు బయట గడిపేస్తాడు.

ఇంటికి వచ్చి ఏమైనా ఆరగిద్దాం అని తోటలోకి వచ్చిన రాక్షసుడికి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. గంభీరమైన గొంతుతో

“ఎవరు మీరంతా? నా తోటలో మీకు ఏమి పని? దొరికారో అమాంతం మింగేస్తా!” అని బెదిరించి వాళ్ళని తరిమేస్తాడు.

వాళ్ళు వెళ్ళిపోగానే, రాక్షసుడు, తన ఇంటి ప్రాంగణం చుట్టూ పది అడుగుల గోడ నిర్మించేస్తాడు. దానితో పిల్లలు లోపలకి రాలేక, బయట నుండే “లోపల మనం ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో” అని బాధపడేవారు.

కొద్ది రోజుల తర్వాత, ఆ గ్రామంలో వసంత ఋతువు మొదలు అయింది. ఊరంతా పూలతో అందంగా ముస్తాబైనట్లు ఉండగా, రాక్షసుడి ఇళ్లు మాత్రం మంచుతో నిండిపోయుంది. పక్షులు ఆ తోటలోకి రాలేదు, పువ్వులు పూయలేదు. ఒక రోజు మాత్రం ఒక పువ్వు మంచులో నుంచి బయటకి వచ్చి, పిల్లలు లేని ఈ మంచు ఎడారిలో నేను మాత్రం ఎందుకు అని వెంటనే మంచు లోపలకి వెళ్లి నిద్రపోయింది. శరదృతులో పండ్లు కూడా పండలేదు రాక్షసుడు తోటలో. మంచు అధికమై, శీతాకాలంలో వడగళ్ళు పడినట్లు, విపరీతమైన చలి ఉంది రాక్షసుడి ఇంట్లో. ఇంట్లో ఉన్న కంబళ్ళు అన్నీ కప్పుకున్నా చలి తగ్గలేదు.

ఏమి జరుగుతుందో అర్ధం అవ్వని రాక్షసుడికి ఒక రోజు మనసుకి హత్తుకునేలా ఓ రాగం వినిపిస్తుంది. అంత మధురమైన రాగం ఏనాడు వినని రాక్షసుడు కంబళ్ళు అన్నీ తీసేసి తోట వైపు పరుగున వెళ్తాడు. ఆ రాగం, చెట్టు మీద వాలిన కోయిలది. తోట తలుపు తీసేలోపల నవ్వులు వినిపించగా, ద్వారం సందులో నుంచి నక్కి చూస్తాడు. నమ్మలేని విధంగా…

మంచు అంతా మాయమైపోయి ఉంటుంది, పిల్లలు చెట్లు ఎక్కి ఆడుకుంటూ ఉంటారు, పువ్వులు, పండ్లు, పక్షులు, చూడటానికే మూడు కళ్ళు సరిపోలేదు రాక్షసుడికి. ముఖం మీద చిరునవ్వుతో ద్వారం వెనుక చేరి వారి ఆటలను చూస్తూ ఉండిపోయాడు. తోట అంతా గమనించగా, ఒక చెట్టు మీద మాత్రం మంచు దుప్పటిలా కప్పి ఉంది. దాని కింద ఒక చిన్న పిల్లవాడు, చెట్టు ఎక్కలేక ఏడుస్తుంటాడు. ఆ చెట్టు తన కొమ్మని కిందకి దించి, పిల్లవాడ్ని ఎక్కించుకోడానికి చూసినా, బాబుకి ఆ కొమ్మ కూడా అందట్లేదు. అది చూసి చలించిపోయిన అసురుడు శబ్దం చేయకుండా ఆ చెట్టు దగ్గరకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. మామిడి చెట్టు అంత ఎత్తు ఉండే అసురుడు పిల్లలకి కనిపించకుండా ఎలా ఉంటాడు? అతడి రాక అందరూ గమనించి, నక్కని చూసిన కుందేళ్ళ వలె తలో దిక్కు పారిపోయారు. పిల్లవాడు మాత్రం కంట్లో నీరు నిండినవాడై, రాక్షసుడు కనిపించక; ఆ చెట్టు ఎక్కడానికి ఏడుస్తుంటాడు.

రెండు వేళ్ళతో చాలా జాగ్రత్తగా పిల్లవాడ్ని పట్టుకుని చెట్టు పైకి ఎక్కిస్తాడు. ఒక్క సారిగా ఆ చెట్టుకి ఉన్న మంచు అంతా మాయం అయిపోయి, లేత గులాబీ రంగు పూలతో నిండిపోతుంది. పిల్లవాడికి సహాయం చేయడం గమినించిన మిగిలిన పిల్లలు, రాక్షసుడు మంచివాడే అని నమ్మి అతడి దగ్గరకి చేరుతారు. అప్పుడు అసురుడు:

“నేను చాలా స్వార్థంతో వ్యవహరించాను, ఇక మీదట ఆలా ఉండను. ఈ తోట ఇక మీరు ఆడుకోడానికే పిల్లలు.” అని చెప్పి, గోడని ముక్కలుగా నేల లోనుంచి పీకి గ్రామం బయటకి విసిరేస్తాడు. 

అప్పటి నుండి గ్రామంలో ఉన్న పిల్లలు అందరూ అసురుడి దగ్గరకి వచ్చి ఆడుకునేవారు. కానీ తనకి ఎంతో ఇష్టమైన పిల్లవాడు మాత్రం ఇక కనిపించలేదు, మిగతా వారిని అడగగా వాడు ఎవరో వాళ్ళకి తెలియదు అని చెప్తారు. సంవత్సరాలు గడిచిపోతాయి, అసురుడు ముసలివాడు అయిపోతాడు, ఎన్నో తరాల పిల్లల్ని తన దగ్గర ఆడించుకుంటాడు, చావుకి దగ్గరలో ఉంటాడు. ఇక ఆడలేక, ఐదు గంగాళాలు అంత పెద్ద కుర్చీలో కూర్చుని  పిల్లలు ఆడుకుంటే చూస్తూ గడిపేవాడు.

ఒక రోజు మధ్యాహ్నం తోటలో కునుకు తీస్తున్న రాస్క్షసుడికి, కోయల గానం వినిపిస్తుంది. లేసి చూడగా తన హృదయానికి దగ్గరైన పిల్లవాడు చెట్టు మీద కూర్చుని ఉంటాడు. రాక్షసుడు కళ్ళలో నీళ్లతో, ఇన్ని సంవత్సరాలకి గుర్తువచ్చానా? అని బాధపడతాడు. ఆ బాబు: “అసురా, ఆ నాడు నీలో మంచిని వెలికితీయడానికి వచ్చాను, ఈ రోజు నిన్ను నాతో తీసుకుపోదామని వచ్చాను. స్వర్గంలో నా తోటలో ఆడుకుందాము పద.” అని చెప్పగానే రాక్షసుడు ఆనందంగా చివరి శ్వాస విడుస్తాడు.

అసురుడి శరీరం మీద మల్లెపూలు వికసించి ఆ గ్రామం అంతా పరిమళం విస్తరిస్తుంది.

ఏమైందో అని చూడడానికి వచ్చిన పిల్లలకి, తోటలో చనిపోయిన అసురుడు కనిపిస్తాడు.

Native embracing from The Selfish Giant by Oscar Wilde

Comments

comments