రెక్కలు – లేనూరు అనే గ్రామంలో

తరాలు మారినా పల్లెటూరు లోని ప్రేమలు ఆప్యాయతలు మారవు అంటారు. ఆ అనురాగాలను వెతుకుతూ అతడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎన్నో సంవత్సరాలు తర్వాత వెల్దామనుకున్నాడు. రెక్కలు కోసేసిన విహంగంలా పట్నం లో నాలుగు గోడల మధ్య, నవ్వు లేని నవ్వుల మధ్య, ప్రేమ లేని పలకరింపులు మధ్య, ఆశ గమ్యమైన మాటల మధ్య నలిగిపోయిన అతనికి ఒక రోజు చిన్నప్పిటి అమ్మమ్మ కథలు, తాతయ్య పెద్దరికం, పాలేరులతో ఆట, స్నేహితులతో వాగులు గుట్టలు తిరగడం గుర్తుకు వచ్చాయి. స్వచ్ఛమైన తన ఊరి గాలిని పీల్చి, అమ్మమ్మ-తాతయ్యతో సమయం గడుపుదాం అని వెంటనే సెలవు పెట్టి ఊరికి బయల్దేరాడు.
ఒక పక్క ఏరు, మూడు పక్కల కొండల మధ్యన ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా, ప్రకృతి పెంచిన సోయగంలా ఉండేదని అతనికి గుర్తు. సొంత వాహనం ఉన్నా ప్రభుత్వం వారు ఊరికి వేసిన బస్సులోనే ప్రయాణం చేద్దామని, బస్సు ఎక్కి కుతూహలంతో తెలిసిన వారు ఎవరైనా ఉన్నారేమో చూసాడు అతను. మతిమరుపో లేక అందులో నిజంగా ఎవరు తన ఊరి వారు లేరో తెలియలేదు అతనికి. చేసేది ఏమి లేక జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, దారిలో వస్తున్న ఒక్కొక్క ఊరిని గుర్తుపట్టి మనసుని సంతోషంతో నింపుకునే వాడు.


జ్ఞాపకాల మాయలో సమయం తెలియకుండా అయిపోయింది, అతని ఊరి దగ్గర బస్సు ఆగింది. నిట్టూర్పు వదిలి, మొహం మీద చిరునవ్వుతో బస్సు దిగుతాడు అతను. పాపం అతని చిరునవ్వు కొద్దిసేపటికే మాయం అయిపోయింది. తాను ఊరు రాగానే ఇంటికి తీసుకువెళ్లే మేఘం రాలేదు. బస్సు ఆగే చోట రాబందులు, గుడ్లగూబలు, తీతువు పక్షులు లేవు, మార్గ మధ్యంలో గుడిలో దేవుడు లేడు, గుడిని మొత్తం ఆక్రమించే పరిమాణంలో పూజారి మాత్రమే ఉన్నాడు, కొండల పచ్చదనం పోయి నల్లగా మారిపోయున్నాయి, కొండల దగ్గర కర్మాగారాలు రక్తాన్ని పొగలా వెదజల్లుతున్నాయి, ఊరు కలత చెంది జీవమొదిలిన కళేబరంలా మారింది. దారిపొడవునా అతనికి కనిపించింది వివిధ రకముల రెక్కలు, వాటిని గమనిస్తూ అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు.

పుష్పమకరంద సువాసనతో, వేప చెట్ల చల్లని దీవెనలతో ఉండే అమ్మమ్మ ఇళ్లు మొత్తం మారిపోయింది. వాడిపోయిన చెట్లకి తాళ్లతో ఉరి వేసిన తెల్లని కుందేళ్లు ప్రతి చెట్టుకీ ఉన్నాయి. కొన్ని చనిపోగా, కొన్ని బ్రతికుండగానే నరకం అనుభవిస్తున్నాయి, తాను ఎక్కడికి వచ్చానో అర్ధం కాలేదు, నెమ్మదిగా లోపలకి వెళ్లగా అమ్మమ్మ కమ్మని పలకరింపు “రా నాయన”, ఆమె అతడ్ని గట్టిగా హత్తుకుని ముద్దులాడి తాతయ్యను పిలుస్తాను ఉండు అని పశువుల కొట్టం వైపు వెళ్ళింది. అతడిలో భయము ఆశ్చర్యము కలగలిసి పోయాయి, అమ్మమ్మ శరీరం ఉంది కానీ ఆమె మోహాకృతి లేదు. శరీరమంతా చర్మంతో ఏ విధంగా కప్పబడి ఉంటుందో, ఆమె మొహం కూడా చదునుగా ఉండి కనులు, ముక్కు, మూతి, చెవులు అంతర్ధానమయ్యాయి.


కాసేపు అయ్యాక వచ్చి అమ్మమ్మ, “తాతయ్య పనిలో ఉన్నారు నువ్వు స్నానం చేసి రా, ఏమైనా తిందువు” అని చెప్పింది. స్నానం చేయడానికి వెళ్లగా అతనికి అక్కడ బురద తప్ప ఏమి కనపడలేదు, ఆగలేక అమ్మమ్మ ఏంటిది అని ప్రశ్నించగా “ఇప్పుడు అందరు బురదనే వాడుతున్నారు, త్వరగా స్నానం చేసి వచ్చేయి” అని సునాయాసంగా స్నానపు గది బయట నుండి అరిచింది. బురద చల్లుకోవడం ఇష్టం లేక అతడు స్నానం చేయకుండా బయటకి వచ్చి, బట్టలు మార్చుకుని భోజనం చేయడానికి కూర్చున్నాడు. పళ్లెంలో కుందేలు తల, కాళ్ళు తీసుకువచ్చి తినమనింది అమ్మమ్మ. పళ్లెంలో కుందేలును చూడగానే భయంతో వెనక్కి వెళ్ళిపోయాడు అతను.


ఎదురుగా ఉంది ప్రేతాత్మలా తన సొంతవారా? ఊరు ఏంటి ఇలా మారిపోయింది, నేను బయటకి సజీవంగానే వెళ్తానా? అనే ఆలోచనలతో అతనికి ముచ్చెమటలు పట్టాయి, శరీరం వణికిపోగా, అమ్మమ్మ వైపు చూడడానికే భయపడ్డాడు అతడు. “బస్సు ఎక్కే ముందే తిన్నాను, కాసేపు ఆగి తింటాను. కాసేపు అలా తిరిగేసి వస్తాను” అని చెప్పి ఇంటి బయటకి వచ్చేస్తాడు అతను. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని భయంతో నెమ్మదిగా, ఇంద్రియాలను ఏకాగ్రతతో నింపి జాగ్రత్తగా ఊరి బయటకి నడవసాగాడు. బస్సు ఎక్కిన ప్రాంతానికి చేరుకోగా అక్కడ మార్గం లేకపోగా ఇరవై అడుగుల రెక్కలతో నిండిన గోడ కనపడింది. రెక్కలు చూడగానే దిక్కు తోచక వెనక్కి తిరిగి చూసాడు అతను.

రెక్కలు


అసంఖ్యాకంగా నీడలు అతని ముందు నిలుచుని ఉన్నాయి. అరవడానికి కూడా ధైర్యం లేక అతను వాటి మధ్యలోనుంచి తల వంచుకుని ఊరి లోపలకి నడవసాగాడు. ఆ నీడల కాళ్ళు మొత్తం రక్తసిక్తం అయ్యి ఉన్నాయి. భయం ఇంకా పెరిగింది అతనికి, ఇంతలో ఎవరో అతడి మెడని పట్టుకుని చీకటిలోకి లాగేసారు. ఊరికి వచ్చినప్పటి నుండి కర్మాగారం నుండి వెలువడే శబ్దం, రక్తపు వాసన తనను చిత్రవధ చేస్తున్నట్టు అనిపించగా, ఒక్క సారికి అవన్నీ కనుమరుగు అయిపోయి అతనికి పూల వాసన, నీరు పారుతున్న శబ్దం వినిపించాయి. లేనూరు తనకి ఇంతకు ముందు ఎలా ఉందో అలా అనిపించింది.


పూర్తిగా లేనూరు వాతావరణాన్ని ఆస్వాదించే లోపు అతని ఎదురుగా తెల్లని ఛాయ నిల్చుని ఎండు కొమ్మలతో ఏర్పడిన సొరంగం వైపు చూపింది. ఆ సొరంగం ఏటిలోకి వెళ్లి అవతల వడ్డుకి చేరింది. అవతల ఒడ్డు వైపు చూడగా అక్కడ సొరంగం నుండి వరుస క్రమంలో నిలుచున్న మనుషులు కనపడ్డారు. వారంతా తమ రెక్కలను చాచి రెండు బండ రాళ్ల మధ్యలోకి వెళ్తున్నారు. అక్కడ ఇద్దరు వికృతాకారంలో ఉన్న మహాకాయులు గొడ్డళ్లతో వారి రెక్కలను నరికి వేస్తున్నారు. రెక్కలు నరికి వేయగానే శరీరంలోనుండి నీడ వేరు అయ్యి, శరీరం అదృశ్యం అయిపోవడం గమనించాడు. మొదటి సారి తనకి రెక్కలు పూర్తిగా అభివృద్ధి చెందనందుకు సంతోషపడ్డాడు అతను. వరుస క్రమంలో నిలుచున్న వారి దగ్గరే రెక్కలకి ఉన్న మాంసం తింటూ ఒంటి కాలు కుక్కలు, తోడేళ్ళు, వాటికి కొద్ది దూరంలో ఒంటి కాలుతో ఒకదానిపై ఒకటి ఎక్కి కనుచూపుమేర నిలుచున్న ఆవులు అతనికి కనిపించాయి.


తన దగ్గర నిల్చుని ఉన్న తెల్లని ఛాయ అతడిని ఒక్క చేత్తో పట్టుకుని ఆ సొరంగంలోకి విసిరేసింది. దొర్లుతూ, ఆగడానికి ప్రయత్నిస్తూ అతను సొరంగంలో అవతల ఒడ్డు వైపు వెళ్ళిపోతున్నాడు. అక్కడకి వెళ్తే జీవితం గమ్యంలేని నీడలా మారిపోతుందని అతనికి తెలుసు. తన విధిని తప్పించుకోవడానికి, ఎలాగైనా బయటపడటానికి ప్రయత్నిస్తాడు, కానీ సొరంగంలో ముందుకి జారుతూ వెళ్ళిపోతాడు. ఎండు కర్రలను పట్టుకోడానికి ప్రయత్నించగా వాటికి ముళ్ళు ఉండడంచే ఎక్కువ సేపు పట్టుకోలేక మళ్ళీ జారిపోయేవాడు.


ఎన్ని సార్లు జారిపోయినా తన ప్రయత్నం మాత్రం ఆపేవాడు కాదు అతను. దానితో అతని శరీరం స్పందించి అతడి రెక్కలను పూర్తిగా విచ్చుకునేలా చేయగా, వాటి సహాయంతో ఎదురుబాకడం మొదలుపెట్టాడు. రెక్కలు గట్టిగా ఊపుతుంటే కొంచం కొంచెంగా పైకి వచ్చేస్తున్నాడు అతడు. ఆ విషయం గమనించిన తెల్ల ఛాయ తన శక్తిచే ఆ సొరంగాన్ని దగ్గరకి చేయడం మొదలు పెట్టింది. రెక్కలు కదపలేక బిగుసుకుపోతున్నాడు అతను, ఎలా తప్పించుకోవాలి? మార్గాలు అన్ని మూసుకుపోతున్నాయి అని విచారిస్తుండగా అతని రూపం పూర్తిగా పరివర్తన చెంది అతడు ఒక పక్షిలా మారిపోయాడు. మారు ఆలోచించకుండా ఆ సొరంగంలో నుండి బయటకి వచ్చేసి ఆ తెల్లని ఛాయకు అందనంత ఎత్తు ఎగిరి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ ఛాయ మొహం మీద నవ్వు కనపడినట్టు అనిపించింది అతడికి, ఆ చాయేమో వీడ్కోలు పలికినట్లు చేతులు ఊపుతుంది అతడికి.


తన పక్షి రూపం బాగుంది అనుకుని అమ్మమ్మ ఇంటి వైపు ఎగురుకుని వెళ్లి, తాతయ్యని చూడడటానికి పశువుల కొట్టం మీద వాలాడు. తాతయ్యకి కూడా అన్ని అంతర్ధానమయ్యి కేవలం కుడి కన్ను మాత్రమే తెరుచుకుని ఉంది. తన చుట్టూ పుస్తకాలు పెట్టుకుని వాటి కాగితాలను ఒంటి మీద అంటించుకుంటున్నాడు ఆయన. ఆ కాగితాలలో సిరా అతని శరీరంలోకి వెళ్తుంటే మరో కన్ను తెరుచుకుంటుంది, సిరా అయిపోగానే మూసుకుపోతుంది. బహుశా అందుకే తాతయ్య తనని చూడటానికి రాలేదు అనుకుని వెంటనే అతడు తాతయ్యని తన పదునైన గోళ్ళతో పట్టుకుని పశువుల కొట్టం నుండి బయటకి తీసుకు వచ్చి కొండల వైపు తీసుకుపోసాగాడు. ఇంత జరుగుతున్నా తాతయ్య మాత్రం చేతిలో ఉన్న కాగితాలను మొహానికి, చేతులకి అంటించుకుంటున్నాడు.


పక్షి రూపంలో ఉన్న అతడు, తాతయ్యతో ఎగురుకుంటూ కొండల వైపు వెళ్తుండగా మధ్యలో కర్మాగారాలు కనిపించాయి. వాటి ముందు లెక్కలేనన్ని మానవ మృత దేహాలు వివస్త్రంగా పడియున్నాయి. శరీరం నుండి నీడను వేరు చేసాక, దేహాలు మాయమయ్యి ఇక్కడ శవాలుగా పడిపోతాయని అనుకున్నాడు అతను. ఆ శవాలని మహాకాయులు ఒక్కొక్కట్టిగా కర్మాగారాలలోకి ఈడ్చుకెళ్తున్నారు మహాకాయులు. ఒక్కొక్క శవం లోపలకి వెళ్తుంటే కర్మాగారాలలోనుంచి రక్తం అధికంగా పైకి చిమ్ముతుంది. వాటిని దాటుకుని కొండలు దాటి పక్క ఊరు చేరుకుంటారు ఇద్దరు. తాతయ్యను ఎక్కువ సేపు మోయలేక ఒక పొలంలో దించుతాడు అతడు, ఆయన వెంటనే సాధారణ స్థితికి చేరుకుని గట్టు మీదనే నిద్రపోతాడు. తన రెక్కలు, తన రూపం తనని ఎంతవరకు తీసుకెళ్తాయో తెలుసుకుందామని అతడు సూర్యుడి వైపు ఎగరడం మొదలు పెడతాడు.

Comments

comments