నీతి కథ: కాకి – కోయల

అనగనగా ఒక అడవిలో కోయలలు కలిసి నివసించేవి. అవి పూట అంతా దొరికిన ఆహారాన్ని ఒక దగ్గరకు చేర్చి, స్నేహితులు అందరితో పంచుకుని తినేవి. ఈ తంతుని చాలా రోజుల నుండి గమనిస్తున్న ఒక కాకి, ఏ కష్టమూ లేకుండా ఆహరం సంపాదించేయొచ్చు అని తన తెలివితో పన్నాగం పన్నింది.

కాకి-కోయల
కాకి  [Corvus culminatus]

మగ కోయల నల్లగా, ఎర్రని రెక్కలతో తనకి దగ్గర పోలికలతో ఉంటుంది కాబట్టి కాకి తన రెక్కలకి ఎర్ర రంగు పూసుకుని చడీ-చప్పుడు లేకుండా కోయల సమూహంతో కలిసిపోయింది. అందరితో పాటు కోయలలా వేషమేసుకున్న కాకి కూడా ఆహరం వెతకడానికి వెళ్లినట్టు వెళ్లి, గుబురు కొమ్మల చాటున నిద్రపోయి, పూట గడిచే సమయానికి తిరిగి వచ్చేది.

కాకి ఏమి తెస్తుందో అంత సమూహంలో కనిపించదు గనుక అది మౌనంగా అక్కడ నిల్చుని, ఆహరం తినే సమయానికి అందరితో కలిసి కడుపు నిండా తినేది. కొద్ది రోజులు అలా గడిచాక, ఆహరం తినే సమయంలో అనుకోకుండా ఒక కోయల ముక్కు కాకికి గుచ్చుకుంటుంది. నొప్పికి అది గట్టిగా “కావ్ కావ్” అని అరవగా, కాకి గుట్టు బయట పడిపోతుంది.

కాకి-కోయల
కోయల [Eudynamys scolopaceus]

కోపంతో కోయిలలు ఆ కాకిని గుంపు నుండి తరిమేస్తాయి. చేసేదేమి లేక కాకి తిరిగి తన పరివారంతో కలిసి పోవడానికి వెళ్తుంది. అయితే, ఎర్ర రంగు రంగులు ఉన్న కాకిని చూసి మిగతా కాకులు అది వేరే రకం పక్షి అని ముక్కులతో పొడిచి తరిమేస్తాయి. వేసిన పన్నాగం ఫలించక, అయిన వాళ్ళు తరిమేసి, కాకి ఒంటరి అయిపోతుంది. ఆ రోజు నుంచి కష్టమైనా సొంతగా ఆహరం సంపాదించుకోవడానికి నిశ్చయించుకుంటది కాకి.

నీతి: సొంత వాటితో సంతసించక, పొరుగు వాటి కొఱకు ఆశించరాదు.

మూలం: The Jackdaw and the Pigeons from the Fables of Aesop.

Comments

comments