తూర్పున ఉదయించే చావు

“నా మజిలీలో మరొక్క రోజు, మరొక్క సృష్టి, మరొక్క చావు.”

నేను మోసే ఉదయాలు ఇంకా దాహార్తితో కష్టపడట్లేదు, ఉదయపు కిరణాలు గడ్డి మైదానాలను ఆనందంతో నిద్రలేపగలుగుతున్నాయి. మేలుకోండి! మేలుకోండి! ఏ మనిషి చేతి గొడ్డలి మీ మీద పడదు అనే ధైర్యంతో మేలుకోండి, బద్దకాన్ని బెరడుగా చేసుకున్న వృక్షాల్లారా. పరిగెత్తు లేగ దూడ, నీ స్వాతంత్య్రం కొద్దీ సేపే, తల్లి పాల అమృతత్వం కోసం పరిగెత్తు. నిద్రలేవండి! తండ్రులారా – భూదేవిని తొలిచి మీరు పడే కష్టం మరిచిపోయారు మీరంతా. మీ లక్ష్యం ఒకటే అయిపోయింది – జీవనోత్పత్తికి తోడ్పడడం.

అదిగో, ఆ మట్టే, దాని స్పర్శతో పులకిరించిపోయేదాన్ని, ఇప్పుడు అదే మట్టి జీవం లేని ఒక పొర కింద దాగిపోయింది. ఆ పొరకి జీవించేది ఏదీ ఇష్టం లేదు, కానీ ఆ పొర అంటే జీవాన్ని నాశనం చేసే వారికి చాలా ఇష్టం.

చావు యొక్క స్వరూపాలు అనంతమైపోయాయి, నా వారు దానికి “పురోగతి” అని పేరు పెట్టారు. కాదు అని చెప్తుంది విద్యుత్తు తీగకి వేలాడుతున్న కుందేలు పిల్ల, సమాధి దగ్గర ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతున్న గ్రద్ద, పాపం ఆ గ్రద్ద మనిషి సృష్టిని తిండి అనుకుని అమాంతం మింగేసింది, ఇప్పుడు చావు కాదు కాదు పురోగతి దానిని మింగేస్తుంది.

పొగలు, కొత్త రంగులలో, విన్నూత్న వాసనలతో నన్ను కాల్చే పొగలు. ఇవి నన్ను చంపే బదులు పురుగుల్ని చంపివుంటే నా రైతు నీలం రంగులోకి మారకుండా ఉండేవాడు కదా, అయ్యో. వారు గుసగుసలు ఆడుతుంటే నాకు వినిపిస్తుంది, వారి ఏడుపులు నాకు కనిపిస్తాయి, కొన్ని సార్లు చప్పుడు లేకుండా వారు వాళ్ళ పూర్వీకుల దగ్గరకి వెళ్ళిపోతున్నపుడు నేను సాక్షిని అవుతాను. అలిసిపోయి, నీరసించిపోయి వారు వెళ్తారు; ఇక్కడ మాత్రం ఎవరు వాళ్ళని ఆదరించారు, పట్టించుకోరు. ఏ పొగలు వారిని బతికించలేవు, ఏ పొగలు జీవాన్ని సృష్టించలేవు, ఏ పొగలు వెళ్ళిపోయినా ఆత్మల కోసం నేను పడే ఆవేదనను తగ్గించలేవు.

ఉదయపు ఆనందాలు మంచుతో పాటే ఆవిరైపోతాయి, నేను మాత్రం తోలు వలిచి ఎండపెట్టిన చేప లాగ సూర్యుడికి దొరికిపోతాను. మా ఇద్దరి మైత్రి బంధం మర్చిపోయాడు సూర్యుడు; తప్పులేదు ఈ వికారమైన పరివర్తన మొదలైన తర్వాత నన్ను నేనే గుర్తు పట్టలేకున్నాను. నేను చనిపోవడం కాయం; నా జీవితాన్ని, జీవన విధాన్నాన్ని చాలా సులభంగా, శోక రహితంగా, జాలి లేకుండా భర్తీ చేసేస్తారు.

నా గురించి బాధపడే అరుదైన వారు కూడా చనిపోతారు – ప్రక్షాళించే వాగులు, పలకరించే వృక్షాలు, పాటలు వినిపించే పక్షులు. నాలుగు కాళ్ళవి మాత్రం నాతో చనిపోవు, అవి వలస వెళ్తూ చనిపోతాయి – వేటాడి, సజీవంగానే వాటి చర్మం తీసి మరీ చంపుతారు.

గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైతే నన్ను తొక్కేస్తున్నారో, నాలో సొంత భావనని నలిపేస్తున్నారో – నేను అంతరించిపోతే ఈ ప్రపంచమే అంతరించిపోతుంది.

అయినా మీలోని వాంఛలను, అత్యాశకు నెలవైన మెదడును రేపటి ఉదయం గురించి ఆలోచించమంటే చాలా ఇబ్బంది. గుర్తుపెట్టుకోండి, మేమంతా, మీ తల మీద ఎర్రగా మండుతున్న కొమ్ములను చూడగలుగుతున్నాము.

ఎద్దు కుళ్లిపోవడానికి, మేక ఆకలితో చిక్కిపోవడానికి సమయం దగ్గర పడుతుంది. అయినా సరే, ప్రకృతమ్మకు పుట్టే ఓ చిన్నారి, గుర్తుపెట్టుకో నీ ఇల్లు ఇదే. నాతో పాటు మానవత్వం కూడా మాయం అయిపోతుంది, మట్టి ఎండిపోతుంది. మర్చిపోకు నాన్న, కొమ్ముల రాక్షషులతో జాగ్రత్త, వారిని తప్పించుకుని ఈ మట్టి మీద కొంచెం నీరు పోయి, మొక్కలను చిగురించనివ్వు, జంతువులతో ఆడుకో, వాటి ఆనందాన్ని పంచుకో. నీ కోసం పక్షులను కొత్త పాటలు పాడనివ్వు, జింకల పొట్ట మీద ప్రకృతమ్మ రూపమై నువ్వు నిద్రపో. బుజ్జి తండ్రి, పచ్చిక బైళ్ళలో భైరాగివై తిరుగు, నీ లాంటి నిర్మలమైన స్పర్శ కోసం అవి తరాల నుంచి ఎదురు చూస్తున్నాయి. హోమో ట్రాన్సెండాలిస్ [Homo transcendalis] అవ్వు, మానవ రుగ్మతలను అధిగమించే వాడివి అవ్వు, మరణాన్ని కాదు జీవాన్ని తీసుకొచ్చే వాడివి అవ్వు. ఓ వెలుగుని సృష్టించు, అది ప్రకృతిని ఆస్వాదించేది అయ్యుండాలి. నాయనా, ముఖ్యంగా నన్ను మర్చిపోకు, అమరమైన జీవనాని నాకు ప్రసాదించు. నన్ను మర్చిపోకు తండ్రి, మర్చిపోకు, గుర్తుపెట్టుకో, నా పేరు గుర్తుపెట్టుకో, నా పేరు “పల్లెటూరు”.

వ్రాసినది: తేజ బసిరెడ్డి

Comments

comments